Loading...
UP: నాలుగో తరగతి ఫొటోతో మిస్సింగ్ యువతి గుర్తింపు.. ఏఐతో పోలీసుల ప్రయోగం
నాలుగో తరగతి ఫొటోతో మిస్సింగ్ యువతి గుర్తింపు.. ఏఐతో పోలీసుల ప్రయోగం

UP: నాలుగో తరగతి ఫొటోతో మిస్సింగ్ యువతి గుర్తింపు.. ఏఐతో పోలీసుల ప్రయోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఇందుకోసం ఆమె నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫొటోను ఉపయోగించారు. చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ జెమినీ (Google Gemini) ఏఐ టూల్స్ సాయంతో ఆమె ప్రస్తుత రూపాన్ని అంచనా వేసే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంతో పాటు పోలీసుల దర్యాప్తు, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను రాజస్థాన్‌లో గుర్తించారు. ఈ ఘటన నవంబర్ 21న వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

తల్లి ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తు

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన మంజు ఖర్వార్ (30) సుమారు ఐదేళ్ల క్రితం తన గ్రామం నుంచి కనిపించకుండా పోయింది.

ఈ విషయంపై ఆమె తల్లి కిస్మత్ దేవి జులై 14న బభాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ గ్రామానికి చెందిన ఓ మహిళ పెళ్లి సంబంధం చూస్తానని చెప్పి మంజును తీసుకెళ్లిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన కానిస్టేబుల్ విజయ్ పాండేకు మొదట్లో ఓ సమస్య ఎదురైంది.

మంజుకు సంబంధించిన ఇటీవలి ఫొటో కుటుంబ సభ్యుల దగ్గర ఒక్కటి కూడా లేదు.

నాలుగో తరగతి చదువుతున్న సమయంలో అంటే 2007లో తీసిన ఫొటో మాత్రమే వారి వద్ద ఉంది.

వివరాలు 

చాట్‌జీపీటీ, జెమినీతో ప్రస్తుత రూపం అంచనా

ఈ సమస్యను అధిగమించేందుకు విజయ్ పాండే అందుబాటులో ఉన్న పాత ఫొటోను చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీకి అప్‌లోడ్ చేశారు.

మంజు చిన్ననాటి ఫొటోతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరి ఫొటోలను కూడా అందులో జత చేశారు.

ఈ చిత్రాల ఆధారంగా ఏఐ టూల్స్ మంజు ప్రస్తుతం ఎలా కనిపించే అవకాశం ఉందో అంచనా వేస్తూ ఓ చిత్రాన్ని రూపొందించాయి.

ఆ చిత్రాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు మంజును గుర్తించడంలో పోలీసులకు సహకరించారు.

అనంతరం పోలీసులు తమ సమాచార వ్యవస్థ ద్వారా వివరాలు సేకరించడంతో పాటు క్షేత్రస్థాయిలోనూ విచారణ చేపట్టారు.

అక్టోబర్ 16న మంజు రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ADVERTISEMENT

వివరాలు 

కానిస్టేబుల్‌కు నగదు బహుమతి, ప్రశంసాపత్రం

దీంతో ప్రత్యేక బృందం హమిర్‌వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను గుర్తించి తిరిగి తీసుకొచ్చింది. మంజు అక్కడ ఉమేంద్ర అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

అతడిని ఆమె భర్తగా గుర్తించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ విజయ్ పాండేకు ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ రూ.5,000 నగదు బహుమతి అందించారు.

సోన్‌భద్ర ఎస్పీ అభిషేక్ వర్మ మరో రూ.2,100తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

అయితే,యువతి ఆచూకీ గుర్తించడంలో ఏఐ రూపొందించిన చిత్రం ఒక్కటే కీలకం కాదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

పోలీసుల దర్యాప్తులో ఉచిత ఏఐ టూల్స్

కుటుంబ సభ్యుల సహకారం, పోలీసులకు అందిన సమాచారం, క్షేత్రస్థాయి దర్యాప్తు కూడా ఈ కేసు పరిష్కారంలో ముఖ్య పాత్ర పోషించాయని తెలిపారు.

సాధారణంగా పాత ఫొటో ఆధారంగా ఒక వ్యక్తి ప్రస్తుత రూపాన్ని అంచనా వేయాలంటే ఫోరెన్సిక్ నిపుణులు లేదా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అవసరమవుతాయి.

కానీ ఈ కేసులో పోలీసు అధికారి సాధారణంగా ప్రజలు ఉపయోగించే చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ఏఐ చాట్‌బాట్‌ల సాయంతో ఈ ప్రయత్నం చేశారు.

భారత్‌లో ఈ రెండు టూల్స్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటికి అదనపు సదుపాయాలతో కూడిన చెల్లింపు ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ADVERTISEMENT