Supreme Court: 'ఎంత ధైర్యం?'.. విద్యార్థికి నోటీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ న్యాయ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. అయినప్పటికీ గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఓ న్యాయ విద్యార్థికి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఆ నోటీసులను అనంతరం ఉపసంహరించుకున్నప్పటికీ.. ఈ వ్యవహారం అత్యంత తీవ్రమైనదని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థులపై చర్యలు తీసుకోరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేజిస్ట్రేట్ కూడా ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది.
వివరాలు
'నోటీసులు ఇచ్చే ధైర్యం ఎలా వచ్చింది?'
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్నందుకే సదరు విద్యార్థికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ అంశం బుధవారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి వచ్చింది.
దీనిపై తీవ్రంగా స్పందించిన సీజేఐ.. ''మేజిస్ట్రేట్ నోటీసులు ఇచ్చే ధైర్యం ఎలా చేశారు? ఏ విద్యార్థిపైనా బలవంతపు చర్యలు తీసుకోవద్దని మేం స్పష్టంగా చెప్పాం. మా ఆదేశాలను ఏ మేజిస్ట్రేట్ కూడా ఉల్లంఘించకూడదు'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఆకృతి చౌధరి ఎన్‌ఎస్‌ఏ కేసులోనూ యూపీ అధికారులకు ఎదురుదెబ్బ
ఇదే సమయంలో విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌధరిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద చర్యలు తీసుకున్న వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ అధికారులను తీవ్రంగా మందలించింది.
అధికారుల తీరు కొనసాగితే ఉత్తరప్రదేశ్ 'ఆర్వెలియన్ డిస్టోపియా'గా మారే పరిస్థితి ఏర్పడుతుందని ధర్మాసనం హెచ్చరించింది.
అధికారులు తమ విధేయతను రాజ్యాంగానికి చూపించాలి తప్ప రాజకీయ నేతలకు కాదని స్పష్టం చేసింది.
వివరాలు
సెప్టెంబర్ 2న ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం కొట్టివేత
నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ ఆమోదించిన ఆకృతి చౌధరి ఎన్‌ఎస్‌ఏ నిర్బంధ ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 2న కొట్టివేసింది.
అంతేకాకుండా ఆమెకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
నిరసనకు సంబంధించిన కేసుల్లో సరైన ఆధారాలు లేకుండానే ఆకృతి చౌధరిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించడంపై గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా యంత్రాంగం, పోలీసుల తీరును ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.