బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రభుత్వ పాఠాశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ఉగాది సందర్భంగా సాధారణ ప్రజల సందర్శనకు ఏడాది పొడవునా తెరిచి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్రపతి నిలయం అధికారులు, తాజాగా విద్యార్థులకు ఉతిత ప్రవేశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్లు గురువారం నుంచి అందుబాటులో వచ్చాయి. సాధారణంగా రాష్ట్రపతి సౌత్ ఇండియా పర్యటనలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం తెరిచి ఉండదు. అయితే ఈ ఏడాదిలో అన్ని రోజులు సందర్శకులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారతీయులకు రూ.50, విదేశీ పౌరులకు ఒక్కొక్కరికి రూ. 250 కాగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించాలని రాష్ట్రపతి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రపతి నిలయానికి 162 ఏళ్ల వారసత్వ చరిత్ర
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి 162 ఏళ్ల వారసత్వ చరిత్ర ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 12వ తరగతి, అంతకంటే తక్కువ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత ప్రవేశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి నిలయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 22న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి నిలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి నిలయం తెరిచి ఉంటుంది.