Hyderabad: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలకు అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితి..
అదే సమయంలో గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఆకాశం మేఘాలతో కమ్ముకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో నేడు మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల తర్వాత వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండగా, రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.