
Metro: హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో చార్జీల పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో చార్జీల భారం తప్పక పోవచ్చని అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
జంటనగరాల పరిధిలో రోజూ లక్షలాది మంది పౌరులు మెట్రో రైలు సేవలను ఉపయోగిస్తున్నారు.
తీవ్ర రహదారి ట్రాఫిక్, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తట్టుకోలేక చాలా మంది ప్రజలు మెట్రో రైలు వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇలాంటి సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వేగంగా చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ (L&T) రూ.6,500 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్టు ఇటీవల ప్రకటించింది.
వివరాలు
ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నియామకం
కోవిడ్-19 మహమ్మారి సమయంలో తీవ్ర ఆర్థిక నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో, 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో చార్జీలను పెంచేలా కేంద్రాన్ని కోరింది.
దీనిపై స్పందించిన కేంద్రం, మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్-2002 ప్రకారం ఓ ఫేర్ ఫిక్సేషన్ కమిటీని (FFC) నియమించింది.
ఈ కమిటీ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్రతిపాదనలు, అలాగే ప్రయాణికుల అభిప్రాయాలను పరిశీలించింది.
అనంతరం మెట్రో చార్జీల పెంపుకు అంగీకారం తెలిపింది. అయితే, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పెంపును ఆమోదించకుండా తిరస్కరించింది.
వివరాలు
రద్దీ సమయాల్లో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్ తొలగింపు
ఇప్పటి పరిస్థితుల్లో, ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలతో సతమతమవుతుండటంతో.. మెట్రో ఛార్జీలు పెరగటం తథ్యంగా కనిపిస్తోంది.
ఇక ఇటీవల బెంగళూరు మెట్రో ఛార్జీలు 44 శాతం వరకు పెరిగినట్టు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంగా హైదరాబాద్ మెట్రోలో కనిష్ట ఛార్జీ రూ.10గా, గరిష్ట ఛార్జీ రూ.60గా ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో ఎంతవరకు పెరుగుతాయన్న స్పష్టత ఇంకా లేదు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే మెట్రో సంస్థ రూ.59 విలువైన హాలిడే సేవర్ కార్డును రద్దు చేసింది.
అంతేకాదు, రద్దీ సమయాల్లో ఇచ్చే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితులన్నీ కలిసి చూస్తే, నగర వాసులకు మెట్రో ప్రయాణం ఖరీదైనదిగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.