Page Loader
Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో
అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro: అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రో రైలు (ఎల్‌ అండ్‌ టి ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌)కు ఒక విశేషమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇటీవల జర్మనీలోని హాంబర్గ్‌లో నిర్వహించిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌' (UITP) 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్ మెట్రో 'ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్‌' అనే ప్రాజెక్టుతో, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) సహకారంతో ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ విషయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

వివరాలు 

ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ల నుండి దాదాపు 500 ఎంట్రీలు

ప్రతి సంవత్సరం పట్టణ ప్రాంతాలలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులను UITP గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తుంది. 2025 ఎడిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ల నుండి దాదాపు 500 ఎంట్రీలు సమర్పించారు. ఈ నేపథ్యంలో 'ఆపరేషనల్ ఎక్సలెన్స్' విభాగంలో హైదరాబాద్ మెట్రో సమర్పించిన ప్రాజెక్టు టాప్‌ 5 తుది జాబితాలో స్థానం దక్కించుకుంది. ముఖ్యంగా డేటా ఆధారిత సమర్థవంతమైన నిర్వహణ విధానాల కోసం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, "నిర్వహణలోని సామర్థ్యం, వినూత్నతతో కూడిన వ్యూహాలతో హైదరాబాద్ మెట్రోను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయగలిగినందుకు గర్వంగా ఉంది," అని హర్షం వ్యక్తం చేశారు.