Loading...
PRTS Project: కూకట్‌పల్లిలో పీఆర్‌టీఎస్‌ భారీ డిపో.. 185 ఎకరాల భూమి అవసరం
కూకట్‌పల్లిలో పీఆర్‌టీఎస్‌ భారీ డిపో.. 185 ఎకరాల భూమి అవసరం

PRTS Project: కూకట్‌పల్లిలో పీఆర్‌టీఎస్‌ భారీ డిపో.. 185 ఎకరాల భూమి అవసరం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలకు అనుసంధానంగా పాడ్‌ కార్లను నడిపేందుకు ఉద్దేశించిన పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (పీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టుపై అధ్యయనం కొనసాగుతోంది. ఈ వ్యవస్థకు అవసరమైన డిపోల ఏర్పాటుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 185 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. పీఆర్‌టీఎస్‌ నెట్‌వర్క్‌కు సమీపంలోనే డిపోలు ఉండాలనే ఉద్దేశంతో అధ్యయన సంస్థ లీ అసోసియేట్స్‌ ప్రాంతాలవారీగా భూమి అవసరాలను అంచనా వేసింది. పీఆర్‌టీఎస్‌ కారిడార్‌-1 కూకట్‌పల్లి నుంచి ప్రారంభం కానుండటంతో అక్కడ డిపో ఏర్పాటుకు 104.8 ఎకరాలు అవసరమని గుర్తించారు. హైటెక్‌సిటీలో రెండు ప్రాంతాల్లో కలిపి 32.5 ఎకరాలు కావాలి. ఇందులో ఒకచోట 30.2 ఎకరాలు, మరోచోట 2.3 ఎకరాలు అవసరమవుతాయి.

వివరాలు 

వేర్వేరు ప్రభుత్వ సంస్థల ఆధీనంలో భూములు

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోనూ మూడు ప్రాంతాల్లో కలిపి 43.2 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఒకచోట 39.7 ఎకరాలు, మరో రెండు ప్రాంతాల్లో కలిపి 3.5 ఎకరాలు కావాలి.

కారిడార్‌-2 పరిధిలోనూ పలు ప్రాంతాలను డిపోల కోసం గుర్తించారు.

పీపుల్స్‌ ప్లాజా ఎదురుగా 0.9 ఎకరాలు, బతుకమ్మ ఘాట్‌ పార్కింగ్‌ ప్రాంతంలో 0.8 ఎకరాలు, సంజీవయ్య పార్క్‌ సమీపంలో 0.7 ఎకరాలు, రాణిగంజ్‌ బస్‌ డిపో వద్ద 1.5 ఎకరాలు అవసరమని నివేదికలో పేర్కొన్నారు.

ఈ భూములు వేర్వేరు ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్నాయి.

వాటి వినియోగానికి సంబంధించి హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) త్వరలో సంబంధిత విభాగాలకు లేఖలు రాయనుంది.

వివరాలు 

ఐటీ భవనాల సమీపంగా అలైన్‌మెంట్

పీఆర్‌టీఎస్‌ మార్గాన్ని పరిశీలిస్తే ఐటీ కారిడార్‌లోని పలు ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు ఐటీ పార్కులకు సమీపంగా అలైన్‌మెంట్‌ను రూపొందించారు.

ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాల ప్రాంగణాల మీదుగా కూడా మార్గాన్ని ప్రతిపాదించారు.

దీంతో ఐటీ సంస్థలు, ప్రధాన కార్యాలయాలు, మెట్రో స్టేషన్ల మధ్య అనుసంధానం మెరుగుపడేలా ప్రణాళిక రూపొందించినట్లు అధ్యయన వివరాలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

మొదటి అధ్యయన ప్రాంతంలో మూడు జోన్లు

మొదటి అధ్యయన ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించారు. జోన్‌-1లో కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం వరకు 7.62 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు.

జోన్‌-2లో రాయదుర్గం మెట్రో స్టేషన్‌, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌, నాలెడ్జ్‌ సిటీ ప్రాంతాలను కలుపుతూ 12.83 కిలోమీటర్ల పరిధిని అధ్యయనం చేశారు.

జోన్‌-3లో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతానికి సంబంధించి 14.01 కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించారు.

ఈ మూడు జోన్లలో మొత్తం పది పీఆర్‌టీఎస్‌ టర్మినల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అనుసంధానంగా కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, దుర్గం చెరువు, రాయదుర్గం మెట్రో స్టేషన్లతోపాటు హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ వద్ద పీఆర్‌టీఎస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

రెండో అధ్యయన ప్రాంతంలో కీలక ప్రాంతాలు

భవిష్యత్తులో మెట్రో రైలు విస్తరణను దృష్టిలో ఉంచుకుని నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్‌, బయోడైవర్సిటీ, ఇందిరానగర్‌/రాడిన్సన్‌ జంక్షన్‌, యూఎస్‌ కాన్సులేట్‌ మెట్రో స్టేషన్ల వద్ద కూడా పీఆర్‌టీఎస్‌ స్టేషన్లను ప్రతిపాదించారు.

రెండో అధ్యయన ప్రాంతంలో సచివాలయం, ఎన్టీఆర్‌ మార్గ్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్లతోపాటు ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌ మెట్రో స్టేషన్‌, బేగంపేట మెట్రో స్టేషన్‌, సంజీవయ్య పార్క్‌, జేమ్స్‌ స్ట్రీట్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు.

ఈ ప్రాంతాలన్నీ కలిపి సుమారు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో భవిష్యత్తులో పీఆర్‌టీఎస్‌ ద్వారా ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉందనే అంశంపైనా అంచనాలు రూపొందించారు.

వివరాలు 

జనాభా, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం

2030 నాటికి 17.43 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ పరిధిలో రోజుకు 75 వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు.

2040 నాటికి ఈ సంఖ్య 96 వేలకు, 2050 నాటికి 1.14 లక్షలకు చేరుతుందని భావిస్తున్నారు.

పీఆర్‌టీఎస్‌ కోసం అధ్యయనం చేసిన రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం 10.86 లక్షల మంది నివసిస్తున్నారు.

పట్టణీకరణ, అభివృద్ధి నేపథ్యంలో 2050 నాటికి ఈ సంఖ్య 20.88 లక్షలకు చేరుతుందని అంచనా వేశారు.

ఇదే సమయంలో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం 8.37 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

2050 నాటికి ఉపాధి పొందేవారి సంఖ్య 17.08 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు.

జనాభా,ఉద్యోగాల సంఖ్య పెరిగే కొద్దీ రవాణా అవసరాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రద్దీ పెరిగితే జీఆర్‌టీఎస్‌ సేవలు

పీఆర్‌టీఎస్‌ విధానంలో ఒక పాడ్‌ కారులో నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

అయితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే సమయాల్లో ఈ వ్యవస్థ సరిపోతుందా అనే అంశాన్ని కూడా అధ్యయన సంస్థ పరిశీలించింది.

రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో గ్రూప్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (జీఆర్‌టీఎస్‌)ను కూడా అందుబాటులోకి తీసుకురావచ్చని సూచించింది.

జీఆర్‌టీఎస్‌ వాహనాల్లో ఒకేసారి 20 నుంచి 25 మంది వరకు ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పీఆర్‌టీఎస్‌తోపాటు జీఆర్‌టీఎస్‌ సేవలను కూడా వినియోగించుకోవడం ద్వారా రవాణా అవసరాలను తీర్చవచ్చని అధ్యయన సంస్థ అభిప్రాయపడింది.

ADVERTISEMENT