Telangana Tourism: టాప్-10లో హైదరాబాద్ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా వెలుగొందుతున్న గోల్కొండ కోట, చార్మినార్‌లు పర్యాటక రంగంలో విశేష గుర్తింపును పొందాయి.
దేశంలో అత్యధికంగా సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో ఇవి ప్రాముఖ్యతను చాటుకున్నాయి.
భారత పురావస్తు శాఖ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్‌ఐ) 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్-10 ప్రదేశాల జాబితాను సోమవారం విడుదల చేసింది.
ఇందులో గోల్కొండ కోటకు ఆరో స్థానం, చార్మినార్‌కు తొమ్మిదో స్థానం లభించాయి. ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్‌మహల్ 61 లక్షల దేశీయ సందర్శకులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న తెలంగాణ పర్యాటక రంగం క్రమంగా కోలుకుంటోంది. దీనికి పురావస్తు శాఖ విడుదల చేసిన తాజా జాబితానే నిదర్శనం.
వివరాలు
కోవిడ్ తర్వాత 30% వృద్ధి
మహమ్మారి అనంతరం హైదరాబాద్ పర్యాటక రంగం సుమారు 30% వృద్ధిని సాధించింది.
నగరానికి ఉన్న పురాతన చరిత్ర, రుచికరమైన వంటకాలు, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
2023-24 సంవత్సరంలో గోల్కొండ కోట,చార్మినార్ కలిపి 28 లక్షల మందికి పైగా దేశీయ పర్యాటకులను ఆకర్షించాయి.
గోల్కొండ కోటను 2022-23లో 15.27 లక్షల మంది సందర్శించగా,2023-24లో ఈ సంఖ్య 16.08 లక్షలకు పెరిగింది. చార్మినార్‌ను 2022-23లో 9.29 లక్షల మంది సందర్శించగా,2023-24లో ఇది భారీగా పెరిగి 12.90 లక్షలకు చేరుకుంది.
గోల్కొండ కోటకు మునుపటి ఏడాదితో పోలిస్తే 2023-24లో 80 వేల మంది ఎక్కువగా వచ్చారు, చార్మినార్‌ను 3.60 లక్షల మంది అదనంగా సందర్శించడం గమనార్హం.