Visakhapatnam: విశాఖలో ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రారంభం.. గ్లోబల్ ఐటీ హబ్‌గా మరో అడుగు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM) తన అత్యాధునిక 'ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్'ను విశాఖలో ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలను మరింత సమర్థంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని ఇసుకతోట జంక్షన్ సమీపంలోని లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్,ఐబీఎం ఇండియా-సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం కేంద్రంలోని ఏఐ గవర్నెన్స్ ఇంటెలిజెన్స్,కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ తదితర విభాగాలను పరిశీలించిన మంత్రి,వాటి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వివరాలు
కీలక రంగాల్లో సేవలు
ఈ ఫ్యూచర్‌నౌ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐబీఎం ఖాతాదారులకు కన్సల్టింగ్ సేవలతో పాటు ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించనున్నారు.
భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై ఐబీఎం చేపడుతున్న పెట్టుబడుల్లో ఈ కేంద్రం కీలక మైలురాయిగా నిలవనుంది.
ఈ కేంద్రంలో కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో సేవలు అందించనున్నారు.
అంతర్జాతీయ స్థాయి డిజిటల్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించనుంది.
వివారాలు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధి
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కేంద్రాల్లో ఆవిష్కరణలు, సేవల సామర్థ్యాన్ని విస్తరించాలనే ఐబీఎం వ్యూహంలో విశాఖ ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
సమృద్ధిగా ఉన్న సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ కారణంగా విశాఖ ప్రపంచ ఖాతాదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న నగరంగా ఎదుగుతోందని సంస్థ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడం కూడా ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా ఐబీఎం వెల్లడించింది.
వివరాలు
విశాఖను ప్రపంచ ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదని, నాణ్యమైన ఉపాధి అవకాశాలు సృష్టించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం, ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ యువతకు అవకాశాలు కల్పించే బలమైన సాంకేతిక వాతావరణాన్ని నిర్మించడమేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంపై ఐబీఎం చూపుతున్న విశ్వాసాన్ని స్వాగతిస్తున్నామని, విశాఖను దేశంలోనే ప్రముఖ ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సంస్థతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నామని తెలిపారు.
వివరాలు
'వికసిత్ భారత్-2047' లక్ష్యానికి తోడ్పాటు
ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ, 'వికసిత్ భారత్-2047' లక్ష్య సాధనలో డిజిటల్ యుగానికి ప్రపంచ నాయకత్వం వహించే అపూర్వ అవకాశం భారతదేశానికి ఉందన్నారు.
ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, ఆధునిక సామర్థ్యాలను సమన్వయం చేసుకుంటే ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించవచ్చని పేర్కొన్నారు.
విశాఖలో ప్రారంభమైన ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రపంచ స్థాయి సాంకేతిక సేవలు, ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచి, భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు
ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్ ఇండియా మేనేజింగ్ పార్ట్‌నర్ ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ, విశాఖలో ఉన్న సాంకేతిక ప్రతిభ,ఉన్నత విద్యాసంస్థలు,బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కారణంగా ఈ నగరం ప్రపంచ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరాలకు కీలక కేంద్రంగా మారుతోందన్నారు.
స్థానిక ప్రతిభను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో తీర్చిదిద్దుతూ యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఐబీఎం కన్సల్టింగ్ దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, బెంగళూరు,భువనేశ్వర్,చెన్నై,గురుగ్రామ్, హైదరాబాద్,కొచ్చి,కోల్‌కతా, ముంబై, పుణెతో పాటు విశాఖపట్నం సహా మొత్తం 15 నగరాల్లో ఫ్యూచర్‌నౌ సెంటర్లను నిర్వహిస్తోంది.
కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేశ్ ఐబీఎం ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.
విశాఖతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచేలా అంకితభావంతో పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు.