LOADING...
 'killer' cough syrup: వామ్మో తయారీ మరీ ఇంత ఘోరంగానా? 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు
'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు

 'killer' cough syrup: వామ్మో తయారీ మరీ ఇంత ఘోరంగానా? 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో "కోల్డ్‌రిఫ్‌"(Coldrif)దగ్గు మందు వాడిన తర్వాత పలు చిన్నారులు మరణించిన సంఘటనపై తీవ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్లు,ఆరోగ్య శాఖ అధికారులు, ఎడపెడా పిల్లలకు దగ్గు,జలుబు సిరప్‌లను డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వాడకూడదని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తులో కోల్డ్‌రిఫ్‌ కేసులో ఒక సంచలన విషయాన్ని గుర్తించారు. చిన్నారుల మరణాల తర్వాత, మధ్యప్రదేశ్ ఫుడ్ & డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్ (FDA) తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్‌ను అప్రమత్తం చేసింది. ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై ప్రత్యేక తనిఖీలను ఆక్టోబర్ 1, 2 తేదీలలో నిర్వహించగా,కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్‌(Sresan Pharmaceuticals)తయారు చేసిన కోల్డ్‌రిఫ్ సిరప్ పరిశీలనలో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు.

వివరాలు 

తనిఖీ సమయంలో బయటపడ్డ విషయాలు: 

తయారీ కేంద్రంలో గ్యాస్ స్టవ్‌లపై రసాయనాలను నేరుగా వేడి చేయడం. పరికరాలు తుప్పుపట్టడం, పైపులు మురికి పట్టడం. సిబ్బంది గ్లౌజులు, మాస్కులు లేకుండా పదార్థాలను మిక్స్ చేయడం. ఎక్కువగా అనుభవం లేని కార్మికులని పనిలో పెట్టడం. నీటి స్వచ్ఛత పరీక్షలు చేయకుండా వాటిని సిరప్‌లో ఉపయోగించడం. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్‌ఈపీఏ (HEPA) వ్యవస్థ లేని పరిస్థితులు, ఇది అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లను 99.97% వరకు తొలగించే శుద్ధి విధానం.

వివరాలు 

రసాయనాల విషయంలో కూడా తీవ్ర ఉల్లంఘనలు: 

చెన్నైలోని రెండు కంపెనీల నుంచి నగదు లావాదేవీల ద్వారా ఇండస్ట్రియల్-గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు. ప్రొపైలిన్ గ్లైకోల్ వంటి కీలక పదార్థాలను ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుండి తీసుకోవడం. డైఈథిలీన్ గ్లైకాల్ (Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియ లేకుండా సిరప్‌లలో కలపడం, ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం.

వివరాలు 

SR-13 డేంజర్‌ బ్యాచ్.. 

ఈ ఏడాదిలోనే SR-13 అనే బ్యాచ్‌లోని కోల్డ్‌రిఫ్ కఫ్ సిరప్‌లు తయారయ్యాయి. ఇవి రెండు సంవత్సరాల కాలపరిమితితో మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లలోకి పంపారు. బయోప్సీ ఫలితాల ప్రకారం, ఈ సిరప్‌లో డైఈథిలీన్ గ్లైకాల్ శాతం 48.6% ఉంది, ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. డైఈథిలీన్ గ్లైకాల్ కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు-సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో పలు చిన్నారులు మరణించారు.

వివరాలు 

ఉల్లంఘనల పరిమాణం: 

ఫార్మాకోవిజిలెన్స్ (Pharmacovigilance) లేకపోవడం. అనుభవం లేని సిబ్బంది. నీటి స్వచ్ఛత పరీక్షల విఫలం. వాయు (వెంటిలేషన్) సమస్యలు. పెస్ట్ కంట్రోల్ లేకపోవడం. ఈ కారణంగా, డ్రగ్స్ & కాస్మెటిక్స్‌ యాక్ట్ 1940 ప్రకారం 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనలు గుర్తించారు.

వివరాలు 

ప్రభుత్వం, ఆరోగ్య శాఖ చర్యలు: 

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక SIT దర్యాప్తు ప్రారంభించింది. శ్రేసన్‌ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు. ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు,ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ అయ్యారు. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్‌ఫర్ చేశారు. సిరప్‌ను రిఫర్‌ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్‌ను అరెస్ట్‌ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్‌డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు.