
Heavy rains: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాల అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం వెస్ట్ బెంగాల్, ఒడిశా తీరాన్ని దాటిందని, దాని ప్రభావం తెలంగాణపై రెండు ద్రోణులుగా విస్తరుతుందని చెప్పారు. వీటిలో ఒక ద్రోణి తెలంగాణలో మరొకటి తెలంగాణ, మహారాష్ట్రపై కవర్ అవుతుందని, అందువల్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే కొన్ని రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉండటానికి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కారణమని తెలిపారు.
Details
నాలుగైదు రోజులు వర్షాలు పడే ఛాన్స్
సిటీలలో భారీ నిర్మాణాలు, వేలాది వాహనాల చలనం వలన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వివరించారు. ఉపరితల చక్రవాత ఆవర్తనాలు ఏర్పడినప్పుడు ముసురు పట్టిన వాతావరణం ఉండటం వల్ల నాలుగైదు రోజులు వరుసగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. వచ్చే నాలుగైదు రోజుల వాతావరణాన్ని అంచనా వేసినప్పుడు, 25వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కొత్త అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని, 27వ తేదీ నాటికి కోస్టల్ ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ నెల 25, 26, 27న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని ఆయన సూచించారు.