ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం
తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాకు సంబంధించిన ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. 2024, జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండే యువకులను ఓటరు జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల జాబితాను సిద్ధం చేయాలని కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆ ఐదు రాష్ట్రాలకు మినహాయింపు
అయితే ఈ ఏడాది ఎన్నికల జరగనున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తాజా జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. వాస్తవానికి ప్రాతినిధ్య చట్టం (1950) ప్రకారం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెల్లో 1వ తేదీల్లో కొత్త ఓటర్లను చేర్చుకోవచ్చు. అయితే కేంద్రం ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీని ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హత తేదీగా నిర్ణయించింది. జనవరి 1వ తేదీని గడువుగా పెట్టుకొని వార్షిక నివేదికను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.