Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపల్ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయించాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అయింది. దాదాపు ఐదు నుండి ఆరుగురు దళిత విద్యార్థులను సెప్టిక్ ట్యాంకు గోతులోకి దించి శుభ్రం చేయడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు దాదాపు 243 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటనపై ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించాడు. దీనికి బాధ్యులైన ప్రిన్సిపాల్ భారతమ్మ, ఉపాధ్యాయుడు మునియప్పలను అరెస్టు చేశారు.
ప్రిన్సిపల్, వార్డెన్ ను సస్పెండ్ చేసిన అధికారులు
ఈ విషయమై సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ పాఠశాలకు శాశ్వత వార్డెన్ లేరని, ఇంచార్జి వార్డెన్ మునియప్పతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనను కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్ సి మహదేవప్ప ఖండించారు. పిల్లలతో అలాంటి పని చేయించడం అత్యంత ఖండించదగ్గ విషయమని, ఈ విషయం తెలిసిన వెంటనే ప్రిన్సిపల్, వార్డన్, ఇతర అధికారులను సస్పెండ్ చేశానని పేర్కొన్నాడు. పాఠశాల సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేశానని, భవిష్యతులో ఇాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరక్టర్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు.