కేరళలో భారత ఆర్మీ జవాన్‌పై దాడి..పెయింట్ తో వీపుపై PFI అని రాతలు
కేరళలోని కొల్లాం జిల్లాలో భారత ఆర్మీ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వీపుపై 'PFI' అని పెయింట్‌తో రాశారు. ఈ సందర్భంగా ఆర్మీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి కడక్కల్‌లోని తన ఇంటి పక్కనే ఉన్న రబ్బరు అడవిలో ఆరుగురు వ్యక్తుల బృందం తనపై దాడి చేసిందని ఆర్మీ సిబ్బంది షైన్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపారు. వారు అతని చేతులను టేప్‌తో కట్టివేసి, ఆకుపచ్చ పెయింట్‌తో అతని వీపుపై PFI అని రాశారు. షైన్ కుమార్ ఫిర్యాదు మేరకు కడక్కల్ పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 143,147, 323, 341, 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో PFI ని నిషేదించిన కేంద్ర ప్రభుత్వం
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ)కింద నిషేధించబడిన పిఎఫ్‌ఐపై దర్యాప్తునకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)కేరళలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన రోజునే ఈ సంఘటన జరగడం గమనార్హం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఇస్లామిస్ట్ సంస్థ PFI, జాతీయ దర్యాప్తు సంస్థ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ కిందకు వచ్చిన తరువాత గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. గ్లోబల్ టెర్రర్ గ్రూపులు,టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించినందుకు ఈ సంస్థపై ఐదేళ్ల పాటు నిషేధం విధించబడింది. నోటిఫికేషన్‌లో, పిఎఫ్‌ఐ అనేక క్రిమినల్,టెర్రర్ కేసులలో ప్రమేయం ఉందని, బయటి నుండి నిధులు,సైద్ధాంతిక మద్దతుతో దేశంలోని రాజ్యాంగ అధికారం పట్ల పూర్తి అగౌరవాన్ని ప్రదర్శిస్తుందని, ఇది దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారిందని కేంద్రం పేర్కొంది.