Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని దాదాపు 15 పోలింగ్ బూత్‌లలో 100 కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. దీనివల్ల నవంబర్ 30వ తేదీన ఓటర్లు ఎక్కువ సేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా ఓటు వేయవచ్చు. అలాగే 109 పోలింగ్ కేంద్రాల్లో 101 నుంచి 200 మంది ఓటర్లు, 292 పోలింగ్ కేంద్రాల్లో 201 నుంచి 300 మంది ఓటర్లు, మరో 292 పోలింగ్ కేంద్రాల్లో 301 నుంచి 40 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల కార్యాలయాలు (డీఈవోలు) గుర్తించాయి. 1,113 పోలింగ్ బూత్‌లలో దాదాపు 500 మంది ఓటర్లు ఉన్నారు.
లింగాపూర్ బూత్‌లో అతి తక్కువ ఓటర్లు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడి లింగాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యల్ప సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయం (సీఈఓ) అధికారులు తెలిపారు. లింగాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో బూత్‌లో కేవలం 56 మంది ఓటర్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. గ్రామ జనాభా తక్కువగా ఉన్నందున పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓటర్లు కూడా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ములుగులోని రామవరం పోలింగ్ కేంద్రంలో 63మంది మాత్రమే ఉన్నారు. ఇక భువనగిరిలోని గంగాపురం బూత్‌లో 68 మంది ఉన్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలోని బోరేగాం పోలింగ్ బూత్‌లో 73 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.