Critical Minerals Race: కీలక ఖనిజాల వేటలో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అత్యంత కీలకంగా మారనున్న ఖనిజ వనరులను సొంతం చేసుకునేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 15 కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) ఒప్పందాలపై సంతకాలు చేసింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ వనరుల కోసం జరుగుతున్న పోటీలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. క్లైమేట్ యాక్షన్ లైవ్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కీలక ఖనిజ వనరుల కోసం వివిధ దేశాలు చేసుకున్న ఒప్పందాల జాబితాలో 41 ఒప్పందాలతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.
వివరాలు
క్లీన్ ఎనర్జీకి కీలకమైన ఖనిజాలు
15 ఒప్పందాలతో భారత్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.
చైనా, కెనడా, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన దేశాలు కేవలం 11 ఒప్పందాలకే పరిమితం కావడంతో భారత్ వాటిని వెనక్కి నెట్టింది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక బ్యాటరీలు, విండ్ టర్బైన్లు, విద్యుత్ గ్రిడ్లు, సెమీకండక్టర్ల తయారీలో కొన్ని ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ముఖ్యంగా లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, రాగి,అరుదైన భూ ఖనిజాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) వీటి తయారీకి అవసరం.
అయితే భారత్‌లో వీటి లభ్యత పరిమితంగా ఉంది.
దీంతో స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విదేశాల్లోని ఖనిజ వనరులను సురక్షితం చేసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
వివరాలు
రూ.16,300 కోట్లతో ప్రత్యేక మిషన్
కీలక ఖనిజాల అన్వేషణ, సేకరణ, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్'కు ఆమోదం తెలిపింది.
2024-25 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకోసం కేంద్రం రూ.16,300 కోట్లు కేటాయించనుంది.
దీనికి అదనంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరో రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఈ మిషన్‌లో భాగంగా దేశీయంగా ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో 1,200 అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
విదేశాల్లోనూ ఖనిజ వనరులను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 26, ప్రైవేటు సంస్థల ద్వారా మరో 24 మైనింగ్ ఆస్తులను దక్కించుకోవాలని ప్రణాళిక రూపొందించారు.
వివరాలు
అర్జెంటీనా, ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాలు
కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేసుకునేందుకు భారత్ అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది.
ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ (కబిల్) అర్జెంటీనాకు చెందిన కామ్యెన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ దేశంలోని కటమార్కా ప్రావిన్స్‌లో 15,703 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఐదు లిథియం బ్లాకుల్లో అన్వేషణ పనులను ప్రారంభించింది.
మరోవైపు ఆస్ట్రేలియాలోని లిథియం, కోబాల్ట్ ఖనిజ ఆస్తుల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది.
జర్మనీ, నార్వేలతో కలిసి ఖనిజాల ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరిస్తోంది.
ఇలా దేశీయ అన్వేషణతో పాటు విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా కీలక ఖనిజాల సరఫరాపై పట్టు సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.