Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు జమ్ముకశ్మీర్ బడ్జెట్ గురించి విన్న తర్వాత నిద్ర కూడా పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జమ్ముకశ్మీర్‌కు కేంద్ర ప్రతిపాదిన ప్రతిపాదించిన రూ.రూ.1.18 లక్షల కోట్లు అనేది.. పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే 4.72 రెట్లు కావడం గమనార్హం. పాకిస్థాన్ 'కశ్మీర్ సంఘీభావ దినోత్సవం' అని పిలవబడే రోజున జమ్ముకశ్మీర్ కోసం భారత ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రకటించడం విశేషం.
స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధే లక్ష్యంగా
జమ్ముకశ్మీర్‌లో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు రెండింటినీ పరిష్కరించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. కేంద్రపాలిత ప్రాంతంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాంస్కృతిక పరిరక్షణ వంటి కీలక రంగాలకు బడ్జెట్‌లో కేంద్ర ప్రాధాన్యమిచ్చింది. స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. కశ్మీర్ కోసం భారత్ భారీగా నిధులు కేటాయిస్తుండగా.. దీనిపై పాక్ నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారని ఆ దేశ నిపుణులే చెబుతున్నారు. జమ్ముకశ్మీర్ బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.