ముంబై : ఇవాళ రెండో రోజు కొనసాగనున్న ఇండియా కూటమి కీలక సమావేశం
ముంబైలో ఇవాళ మరోసారి ఇండియా కూటమి భేటీ కానుంది. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న రెండో రోజు సమావేశంలో 28 బీజేపీయేతర పార్టీలు పాల్గొననున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి రావాలని గురువారం సమావేశంలో విపక్షాలు తీర్మానించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను నిలువరించేందుకు, తమ ప్రణాళికలను వేగం చేయాలని నిర్ణయించుకున్నాయి. కూటమి లోగోను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆవిష్కరించనున్నారు. నేడు మరోమారు విపక్ష కూటమికి కన్వీనర్ పదవిపై చర్చించనున్నారు.
కూటమి మేనిఫెస్టోను అక్టోబర్ 2 నాటికి విడుదల చేయాలి: మమతా బెనర్జీ
అక్టోబర్ 2 నాటికి కూటమి మేనిఫెస్టోను తప్పనిసరిగా విడుదల చేయాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల చివరి నాటికి పార్టీల మధ్య సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేయాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఉమ్మడి జాతీయ ఎజెండాను బుల్లెట్ పాయింట్‌ల రూపంలో సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల భాగస్వామ్యాన్ని త్వరగా ఖరారు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ తరఫున హాజరైన రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున 2024 ఎన్నికల ప్రణాళికలను వేగంగా ఖరారు చేయాలని పలువురు విపక్ష నేతలు అభిప్రాయ వ్యక్తం చేశారు.