Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 74 కేసులు వెలుగు చూసినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే కొనసాగుతోందని మంత్రి తెలిపారు. వైరస్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమూహాలుగా వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇప్పటివరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 56 మంది చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.
వివరాలు
8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసుల వ్యాప్తి మరింత పెరుగుతున్నట్లు ఎలాంటి సూచనలు లేవని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలిస్తే కేరళలో అత్యధికంగా 780 కేసులు నమోదయ్యాయి.
దీంతో ఆ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. తమిళనాడులో 372, పశ్చిమ బెంగాల్‌లో 261, కర్ణాటకలో 247, దిల్లీలో 227, మహారాష్ట్రలో 169, మిజోరంలో 126 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 74 కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్యలో రాష్ట్రం 8వ స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని, కేసులు పెరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు.