Loading...
BRICS Summit: బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..
బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..

BRICS Summit: బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు పలు కీలక అంశాల్లో తన ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2026లో బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నభారత్.. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దిల్లీలో 18వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, సాంకేతిక రంగం అభివృద్ధి,ఇంధన భద్రత,వాతావరణ మార్పులు,అంతర్జాతీయ పాలనా వ్యవస్థలో సంస్కరణలు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చకు రానున్నాయి. 'బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్,ఇన్నోవేషన్,కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ' అనే థీమ్‌ను భారత్ ఎంచుకుంది. అంటే సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఆర్థిక వ్యవస్థల నిర్మాణం, నూతన ఆవిష్కరణలు, దేశాల మధ్య సహకారం, సుస్థిర అభివృద్ధి చుట్టూ సదస్సు చర్చలను నడిపించాలనేది భారత్ ఉద్దేశం.

వివరాలు 

వాణిజ్యానికి కొత్త ఊపు

దీనికి 'హ్యూమానిటీ ఫస్ట్' అనే దృక్పథాన్ని కూడా జోడించింది.

బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

సభ్య దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం, సరఫరా వ్యవస్థల్లో ఎదురయ్యే అంతరాయాలను తగ్గించడం, అంతర్జాతీయ చెల్లింపులను మరింత సులభతరం చేయడం ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.

జాతీయ కరెన్సీల వినియోగాన్ని పెంచడం, సరిహద్దు చెల్లింపుల వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేయడం వంటి అంశాలపైనా చర్చలు జరిగే అవకాశం ఉంది.

ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ సవాళ్ల నేపథ్యంలో సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయడం భారత్ అజెండాలో ముఖ్యమైన అంశంగా నిలిచింది.

వివరాలు 

వాణిజ్యానికి కొత్త ఊపు

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) కూడా బ్రిక్స్ సహకారం నుంచి ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని భారత్ భావిస్తోంది.

ఇందుకోసం ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ విధానం, ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక సహకార పోర్టల్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐపై ప్రత్యేక దృష్టి ఎందుకు?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చేస్తున్న సాంకేతిక పరిణామాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది.

దీంతో బ్రిక్స్ దేశాల మధ్య ఏఐ సహకారాన్ని పెంచడంపై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఏఐతో పాటు ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), డేటా ఆధారిత వ్యవస్థల్లోనూ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకునేలా ప్రత్యేక రిపాజిటరీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.

ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలను భారత్ ఇప్పటికే విస్తృతంగా అభివృద్ధి చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

స్టార్టప్‌లు, యువతకు ప్రాధాన్యం

ఈ రంగంలో తన అనుభవాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడం ద్వారా ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం కాకుండా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా అందుబాటులోకి రావాలనేది భారత్ ఆలోచనగా కనిపిస్తోంది.

బ్రిక్స్ దేశాల్లోని యువత, స్టార్టప్‌లను నూతన ఆవిష్కరణలతో అనుసంధానం చేయడంపైనా భారత్ దృష్టి సారించింది.

బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి ప్రతిపాదనల ద్వారా కొత్త సంస్థలకు పెట్టుబడులు,సాంకేతిక సహకారం అందించే వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది.

వ్యవసాయ రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని విస్తరించాలనేది భారత్ లక్ష్యం.

ఏఐ,జియోస్పేషియల్ టెక్నాలజీ,ఇతర డిజిటల్ వ్యవస్థలను ఉపయోగించి రైతులకు మెరుగైన సేవలు అందించే దిశగా బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని భారత్ యోచిస్తోంది.

వివరాలు 

వాతావరణం, ఇంధన భద్రతపైనా ఫోకస్

బ్రిక్స్ కూటమిలో ప్రపంచంలోని ప్రధాన ఇంధన ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఉన్నారు.

దీంతో ఇంధన భద్రత కూడా శిఖరాగ్ర సదస్సులో కీలక అంశంగా మారనుంది.

స్మార్ట్ గ్రిడ్లు, ఎనర్జీ స్టోరేజ్, హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, కీలక ఖనిజాలు, కార్బన్ క్యాప్చర్ వంటి రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు భారత్ ప్రయత్నించనుంది.

అదే సమయంలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి పెట్టనుంది.

క్లైమేట్ రెసిలియంట్ మౌలిక వసతుల అభివృద్ధి, గ్రీన్ ఫైనాన్స్, సుస్థిర పట్టణాభివృద్ధి వంటి అంశాలను బ్రిక్స్ అజెండాలో ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది.

వివరాలు 

ప్రపంచానికి భారత్ ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే..

బ్రిక్స్ విస్తరణ తర్వాత భారత్‌లో జరుగుతున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేసియా కలిపి మొత్తం 11 దేశాలు బ్రిక్స్‌లో సభ్యులుగా ఉన్నాయి.

ఇలాంటి సమయంలో భారత్ బ్రిక్స్‌కు అధ్యక్షత వహించడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

కేవలం రాజకీయ ప్రకటనలకే సమావేశాలను పరిమితం చేయకుండా.. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణం వంటి రంగాల్లో సభ్య దేశాలకు ప్రత్యక్ష ప్రయోజనాలు కలిగించే సహకారాన్ని పెంచాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని భారత్ ఇవ్వాలని చూస్తోంది.

వివరాలు 

ప్రపంచానికి భారత్ ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే..

అంతర్జాతీయ ద్రవ్య, రాజకీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం,అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియల్లో మరింత ప్రాధాన్యం కల్పించడం, ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంచడం వంటి అంశాలను కూడా భారత్ బలంగా ప్రస్తావించనుంది.

ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా బ్రిక్స్‌ను మరింత ప్రభావవంతమైన వేదికగా తీర్చిదిద్దడమే భారత్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో దిల్లీలో జరగనున్న సదస్సు కేవలం దేశాధినేతల సమావేశంగా మాత్రమే కాకుండా.. ప్రపంచ వాణిజ్యం, సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ భవిష్యత్‌పై భారత్ తన దృక్పథాన్ని వెల్లడించే వేదికగా మారనుంది.

సెప్టెంబర్‌లో జరిగే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు బ్రిక్స్ కూటమి భవిష్యత్ ప్రాధాన్యాలు, దిశను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

వివరాలు 

బ్రిక్స్ సదస్సు షెడ్యూల్ 

ప్రస్తుత అధికారిక షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12న సభ్య దేశాల నేతల సమావేశాలు, 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శన, గ్రూప్ ఫొటో, వృక్షారోపణ, ప్రధాని విందు ఉంటాయి.

సెప్టెంబర్ 13న భాగస్వామ్య దేశాల నేతల రాక, గ్రూప్ ఫొటో, 'ఇన్‌క్లూజివ్ గ్లోబల్ గ్రోత్'పై ప్రధాన ఓపెన్ సెషన్ జరగనుంది.

ADVERTISEMENT