Loading...
Hydrogen Train: రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్‌ రైలు ప్రత్యేకతలు ఇవే!
రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్‌ రైలు ప్రత్యేకతలు ఇవే!

Hydrogen Train: రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్‌ రైలు ప్రత్యేకతలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో తొలి హైడ్రోజన్‌ ఆధారిత రైలు పట్టాలెక్కడం భారత రైల్వే చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, కాలుష్యాన్ని తగ్గించడం మరియు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యం. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ రైలు భవిష్యత్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

హైడ్రోజన్‌తోనే విద్యుత్‌ ఉత్పత్తి

ఈ రైలులో డీజిల్‌ ఇంజిన్‌ అవసరం ఉండదు. ట్యాంకుల్లో నిల్వ చేసిన హైడ్రోజన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో ఫ్యూయల్‌ సెల్‌లో రసాయన చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆ విద్యుత్‌తోనే రైలు మోటార్లు పనిచేస్తాయి. అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు.

రైలు వేగం పెంచాల్సిన సందర్భాల్లో ఆ నిల్వ విద్యుత్‌ను వినియోగిస్తారు. దీంతో ఇంధన వినియోగం మరింత సమర్థవంతంగా ఉంటుంది.

వివరాలు 

కాలుష్యానికి గుడ్‌బై

సాధారణ డీజిల్‌ లోకోమోటివ్‌ల నుంచి కార్బన్‌ డైఆక్సైడ్‌, పొగ వంటి కాలుష్యకారక వాయువులు వెలువడతాయి.

అయితే హైడ్రోజన్‌ రైలు నుంచి నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది.

హానికరమైన ఉద్గారాలు లేకపోవడం దీని ప్రధాన ప్రత్యేకత. అంతేకాదు, డీజిల్‌ ఇంజిన్లతో పోలిస్తే శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

అందువల్ల ప్రపంచంలోనే అత్యంత పర్యావరణహిత రైళ్లలో హైడ్రోజన్‌ రైళ్లు ఒకటిగా గుర్తింపు పొందుతున్నాయి.

రైల్వే రంగంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రయాణికులకు అందుబాటు ధర

ప్రస్తుతం ఈ హైడ్రోజన్‌ రైలు హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తోంది.

రోజుకు రెండు ట్రిప్‌లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రయాణికుల కోసం టికెట్‌ ధరను రూ.5 నుంచి రూ.25 మధ్య నిర్ణయించే అవకాశం ఉంది.

కొన్ని మెట్రో ప్రయాణాల కంటే, కొన్ని రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్ల కంటే కూడా ఈ ప్రయాణం చౌకగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

వేగం.. సామర్థ్యం కూడా ఎక్కువే

ఈ రైలు సాధారణ సేవల్లో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ట్రయల్‌ రన్‌ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని విజయవంతంగా నమోదు చేసింది.

ఇందులో రెండు డ్రైవింగ్‌ పవర్‌ కార్లతో పాటు ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లు ఉన్నాయి.

మొత్తం 682 సీట్లు అందుబాటులో ఉండగా, ఒకేసారి సుమారు 2,600 మంది వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వివరాలు 

భద్రతకు అత్యధిక ప్రాధాన్యం

హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తున్నందున భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎక్కడైనా హైడ్రోజన్‌ లీకేజీ జరిగిన వెంటనే గుర్తించే అత్యాధునిక సెన్సార్లను ఏర్పాటు చేశారు.

అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించే హెచ్చరిక వ్యవస్థలను కూడా అమర్చారు.

అంతేకాకుండా రైలు పనితీరును నిరంతరం పర్యవేక్షించే సాంకేతిక వ్యవస్థను అందుబాటులో ఉంచారు.

దీంతో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా వెంటనే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT