Loading...
Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు
జింద్-సోనిపట్ మధ్య సేవలు

Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2026
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో జూలై 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిష్ఠాత్మక రైలుకు పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో హైడ్రోజన్ ఆధారిత రైలు సాంకేతికతను వినియోగిస్తున్న జర్మనీ,జపాన్, చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరనుంది. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో నడవనుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు నిర్వహిస్తూ ప్రయాణికులకు సేవలు అందించనుంది.

వివరాలు 

చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో హైడ్రోజన్ రైలును రూపొందించారు

రూట్ నంబర్ 74010 కలిగిన ఈ రైలు ఉదయం 7:40 గంటలకు జింద్ నుంచి బయలుదేరి,ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది.

మార్గమధ్యంలో జింద్ సిటీ, పాండు పిండర, లలిత్ ఖేరా, భంబేవా, గోహనా సహా మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రూపొందించారు.

ఇందులో రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్రయాణికుల కోచ్‌లు కలిపి మొత్తం 10 కోచ్‌లు ఉన్నాయి.

గంటకు గరిష్ఠంగా 75 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో ప్రయాణించే ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వివరాలు 

హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

సాధారణ రైళ్ల మాదిరిగా ఈ రైలుకు డీజిల్ ఇంధనం లేదా ఓవర్‌హెడ్ విద్యుత్ తీగల అవసరం ఉండదు.

రైలులో ఏర్పాటు చేసిన ఫ్యూయల్ సెల్స్ (ఇంధన కణాలు)ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

నిల్వ చేసిన హైడ్రోజన్ వాయువు, గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్యకు లోనై విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే విద్యుత్‌తో రైలు నడుస్తుంది.ఈ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాలు వెలువడవు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా విడుదల అవుతాయి.

ADVERTISEMENT

వివరాలు 

జింద్‌లో హైడ్రోజన్ ఉత్పత్తి,రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు 

దీంతో ఈ రైలు పూర్తిగా పర్యావరణహిత రవాణా వ్యవస్థగా నిలుస్తుంది.

హైడ్రోజన్ సరఫరా కోసం జింద్‌లో 3,000 కిలోగ్రాముల నిల్వ సామర్థ్యం కలిగిన ప్రత్యేక హైడ్రోజన్ ఉత్పత్తి, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని భారతీయ రైల్వే శాఖ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

ఈ సదుపాయంతో రైలుకు అవసరమైన ఇంధనాన్ని వేగంగా నింపే అవకాశం కల్పించారు.

భారతీయ రైల్వేలు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ హరిత రవాణా దిశగా వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం కీలక మైలురాయిగా నిలవనుంది.

ADVERTISEMENT