Bullet Train: వచ్చే ఏడాది మే,జూన్‌లో బుల్లెట్ రైలు ట్రయల్స్.. రైల్వే మంత్రి ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో ఈ హైస్పీడ్ రైలు ట్రయల్ రన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పరీక్షలు పూర్తయిన తర్వాత రెండు నుంచి నాలుగు నెలల్లో వాణిజ్య సేవలు అందుబాటులోకి రావచ్చని తెలిపారు. వడోదరలో జరిగిన 'నమో ఫర్ వికసిత్ భారత్' కార్యక్రమంలో రైల్వే మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. దేశీయంగా తయారవుతున్న హైస్పీడ్ రైలు తొలి బాడీ ఫ్రేమ్ ఇటీవల పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ ఫ్రేమ్‌పై స్క్వీజ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు వేగంగా
"వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి మన దేశీయ బుల్లెట్ రైలు ట్రయల్స్ కోసం పట్టాలపైకి వస్తుంది. రెండు నుంచి నాలుగు నెలల పాటు పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు" అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
ఇందులో సూరత్-వాపి మార్గం ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే వడోదర నుంచి ముంబైకి ప్రయాణ సమయం కేవలం గంటన్నరకు పరిమితం కానుందని చెప్పారు.
వివరాలు
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో..
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగానే దేశీయ బుల్లెట్ రైలు ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
రైల్వే వ్యవస్థలో ఆపరేటింగ్, రిజర్వేషన్ విధానాలతో పాటు నిర్మాణ ప్రక్రియలను కూడా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా మార్చుతున్నామని తెలిపారు.
280 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 280 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
అలాగే కొత్తగా 36 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లను నిర్మించినట్లు తెలిపారు.
వందే భారత్ రైళ్లలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఆధారంగా కార్గో రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
వివరాలు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కీలక రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
వీటిలో చినాబ్ వంతెనతో పాటు మిజోరాంను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రాజెక్టు కూడా ఉందని పేర్కొన్నారు.
కొవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ దేశంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి వేగాన్ని మరింత పెంచామని మంత్రి తెలిపారు.