LOADING...
India: వెనిజువెలా పరిణామాలపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రకటన
వెనిజువెలా పరిణామాలపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రకటన

India: వెనిజువెలా పరిణామాలపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జనవరి 4, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తున్నట్లు స్పష్టం చేసింది. వెనిజువెలా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. సమస్యలను శాంతియుతంగా, పరస్పర సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కొనసాగడం అత్యంత అవసరమని పేర్కొంది. అలాగే కారకాస్‌లోని భారత రాయబారం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తోందని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

Details

వెనిజువెలాపై పెద్ద ఎత్తున సైనిక దాడులు

ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెనిజువెలాపై పెద్ద ఎత్తున సైనిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు వెల్లడించారు. ఈ దాడులు అమెరికా చట్ట అమలు సంస్థల సహకారంతో జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. మడురో, ఆయన భార్యపై న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు నార్కో ఉగ్రవాదం, అమెరికాపై విధ్వంసకర ఆయుధాలు వినియోగించేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

Advertisement