
Bhargavastra: స్వదేశీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
సాంకేతిక ప్రగతికి అనుగుణంగా డ్రోన్లు ఇప్పుడు సులభంగా లభించగలిగే సాధనాలుగా మారిపోయాయి.
అయితే,ఇవి ఇప్పుడు దేశ భద్రతకు తీవ్రమైన సవాళ్లుగా ఎదుగుతున్నాయి.
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో,పాకిస్తాన్ భారీగా డ్రోన్లను ఉపయోగించి భారత్ మీద దాడులకు యత్నించగా, మన సైన్యం తక్షణమే స్పందించి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్ ముప్పుల దృష్ట్యా, వాటిని సమూహంగా నిర్వీర్యం చేసే ఒక ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేశారు.
దేశీయంగా తయారైన ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థకు 'భార్గవాస్త్ర' (Bhargavastra) అని నామకరణం చేశారు.
దీన్ని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే సంస్థ తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసింది. తాజాగా ఈ భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు.
వివరాలు
ఒడిశాలోని గోపాల్‌పూర్ సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్ష
ఒడిశాలోని గోపాల్‌పుర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా, అన్ని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలిగిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
మొత్తం మూడు విడతలుగా పరీక్షలు నిర్వహించగా,మొదటి రెండు ట్రయల్స్‌లో ఒక్కొక్క మైక్రో రాకెట్ ఉపయోగించి పరీక్షించారు.
మూడవ ట్రయల్‌లో రెండు రాకెట్లను ఒకేసారి కేవలం రెండు సెకన్ల వ్యవధిలో ప్రయోగించి లక్ష్యాన్ని ధ్వంసం చేశారు.
ఈ భార్గవాస్త్ర పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేయబడింది.
ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సహాయంతో నిర్వీర్యం చేయగలదు.
ఇందులో అమర్చిన రాడార్ వ్యవస్థ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని గగనతల ముప్పులను ముందుగానే గుర్తించగలదు.
వివరాలు
భార్గవాస్త్రను 5000 మీటర్ల ఎత్తులో వినియోగించవచ్చు
తొలి స్థాయిలో, ఇది అన్‌గైడెడ్ మైక్రో రాకెట్లను ఉపయోగించి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల సమూహాన్ని తునాతునకలుగా చేస్తుంది.
రెండవ స్థాయిలో, గైడెడ్ మైక్రో మిసైల్ వ్యవస్థను ఉంచారు. ఇవి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించి ధ్వంసం చేయగలవు.
భార్గవాస్త్రను 5000 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్రతీర భూభాగాల్లో, పర్వత ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా వినియోగించవచ్చని సంస్థ వివరించింది.