దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!
దేశంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లలోని డేటా ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. దేశంలో మొత్తం 4,001మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా వారి మొత్తం ఆస్తులు రూ. 54,545 కోట్లుగా ఏడీఆర్ నివేదిక చెబుతోంది. ఇది మొత్తం నాగాలాండ్, మిజోరాం, సిక్కింల 2023-24వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. నాగాలాండ్ బడ్జెట్ 2023-24 రూ.23,086 కోట్లు, మిజోరం రూ.14,210 కోట్లు, సిక్కిం రూ.11,807 కోట్లు. అంటే ఈ మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కలిపితే రూ. 49,103 కోట్లు మాత్రమే అవుతుంది.
సగటు ఆస్తిలో వైసీపీ ఎమ్మెల్యేలే టాప్
మొత్తం 84రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.13.63 కోట్లుగా నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీల పరంగా చూస్తే, 1,356మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక సభ్యుడి సగటు ఆస్తి రూ.11.97కోట్లు కాగా, 719మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.21.97కోట్లు, 227టీఎంసీల ఎమ్మెల్యేలకు రూ.3.51కోట్ల చొప్పున, 161మంది ఆప్ ఎమ్మెల్యేలకు రూ.10.20 కోట్ల చొప్పు, వైఎస్సార్సీపీకి చెందిన 146 మంది ఎమ్మెల్యేలకు 23.14కోట్లుగా విశ్లేషించారు. దేశ వ్యాప్తంగా చూసుకుంటే, వైసీపీ ఎమ్మెల్యే సగటు వ్యక్తిగత ఆస్తి ఎక్కువగా ఉంది. దేశంలోని బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 15,798కోట్లు. ఈ రెండు పార్టీల వద్ద రూ. 32,032కోట్లు ఉన్నట్లు నివేదిక చెబుతోంది.
కర్ణాటక టాప్, 3వ స్థానంలో ఏపీ, 8వ ప్లేస్‌లో తెలంగాణ
రాష్ట్రాల వారీగా చూసుకుంటే, కర్ణాటకలో 223 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, వారి ఆస్తులు రూ.14,359 కోట్లుగా నివేదిక పేర్కొంది. దీంతో ఈ జాబితాలో కర్ణాటక టాప్‌లో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఎనిమిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న 284 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.6,679 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 175 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ.4,914 కోట్లుగా విశ్లేషించారు. కర్ణాటకలోని ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆస్తులు మిజోరాం, సిక్కిం వార్షిక బడ్జెట్‌ల కంటే ఎక్కువ. మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల్లో 26 శాతం కర్ణాటక ఎమ్మెల్యేలవే కావడం గమనార్హం.