Student suicide rate: భారతదేశంలో గుబులుపుట్టిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల రేటు.. జనాభా పెరుగుదల రేటును మించి..
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఒక తాజా నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం, జనాభా పెరుగుదల రేటును మించి విద్యార్థుల ఆత్మహత్యల రేటు ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వివరాల ఆధారంగా రూపొందించిన "స్టూడెంట్ సూసైడ్స్: యాన్ ఎపిడమిక్ స్వీపింగ్ ఇండియా" అనే నివేదిక, వార్షిక IC3 కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్‌పో 2024 సందర్భంగా విడుదల చేశారు నివేదిక ప్రకారం, దేశంలో మొత్తం ఆత్మహత్యల వార్షిక పెరుగుదల రేటు 2 శాతంగా ఉంటే, విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇది కేవలం నమోదైన కేసుల ఆధారంగా ఉన్న గణాంకమని పేర్కొంది.
మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7 శాతం
గత రెండు దశాబ్దాలలో విద్యార్థుల ఆత్మహత్యల పెరుగుదల 4 శాతానికి చేరింది, ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు అని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం ఆత్మహత్యలలో పురుష విద్యార్థుల వాటా 53 శాతమని, 2021-2022 మధ్య పురుష విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గగా, అదే సమయంలో మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 7 శాతం పెరిగాయని నివేదిక వివరించింది. గడిచిన దశాబ్ద కాలంలో 0-24 ఏళ్ల వయస్కుల జనాభా 58.2 కోట్ల నుండి 58.1 కోట్లకు తగ్గినా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కు పెరిగాయని నివేదిక వెల్లడించింది. IC3 ఇన్‌స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు మార్గదర్శనం చేయడంలో సహకరించడమే కాకుండా టీచర్లకు శిక్షణ అందిస్తోంది.
10వ స్థానంలో రాజస్థాన్
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు విద్యార్థుల ఆత్మహత్యలలో అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశ వ్యాప్తంగా జరిగే మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో మూడింట ఒక వంతు ఈ మూడు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం కేసులలో 29 శాతం వాటాను కలిగి ఉంటే, కోటా వంటి కోచింగ్ హబ్ ఉన్న రాజస్థాన్ 10వ స్థానంలో ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు పట్ల తల్లిదండ్రులు గుబులు చెందుతున్నారని,దీనిపై మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో విద్యార్థులపై అధిక మానసిక ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉందని,అహేతుక పోటీలను నివారించాల్సిన అవసరాన్ని IC2 మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు గణేశ్ కోహ్లి అన్నారు.