Loading...
Dawood Ibrahim : దావూద్‌ భయ్య భారత్‌లోనే ఉన్నాడట...ఐరాస నివేదికపై భారత్‌ ఫైర్
దావూద్‌ భయ్య భారత్‌లోనే ఉన్నాడట...ఐరాస నివేదికపై భారత్‌ ఫైర్

Dawood Ibrahim : దావూద్‌ భయ్య భారత్‌లోనే ఉన్నాడట...ఐరాస నివేదికపై భారత్‌ ఫైర్

వ్రాసిన వారు Balachander Sharma
ద్వారా సవరించబడింది Jayachandra Akuri
Oct 22, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దావూద్‌ ఇబ్రహీంను భారత్‌లో ఉంటున్న ఉగ్రవాదిగా చిత్రీకరించేలా ఐరాస నివేదికలో పేర్కొనడంపై భారత్‌ అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను విస్మరించడంపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్‌ సౌల్‌ను విమర్శించింది.

Details

భారత్‌లోనే దావూద్‌ ఇబ్రహీం

పరారీలో ఉన్న ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహీంను భారత్‌లోనే ఉంటున్న వ్యక్తిగా చిత్రీకరించేలా ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొనడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

వాస్తవాలను సరిగ్గా ప్రస్తావించకుండా నివేదిక రూపొందించడం అంతర్జాతీయ సంస్థ విశ్వసనీయతకు నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది.

ఉగ్రవాద నిరోధక చర్యలు, మానవ హక్కుల అంశాలపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్‌ సౌల్‌ రూపొందించిన నివేదికలోని వివరాలే ఈ వివాదానికి కారణమయ్యాయి.

Details

నివేదికలో వాస్తవాలు విస్మరించారంటూ విమర్శలు

ఐరాసలో భారత శాశ్వత మిషన్‌కు చెందిన ఫస్ట్‌ సెక్రటరీ రఘు పూరి బుధవారం ఈ అంశంపై స్పందించారు.

జూలైలో విడుదలైన నివేదికలో దావూద్‌ ఇబ్రహీంను 'భారత్‌ కేంద్రంగా పనిచేసే' డీ-కంపెనీ ముఠా నాయకుడిగా పేర్కొన్నారని తెలిపారు.

అయితే, దావూద్‌ 1993 నుంచి ఉగ్రదాడుల కేసుల్లో భారత్‌కు కావాల్సిన నిందితుడని, దశాబ్దాల క్రితమే దేశం విడిచి పారిపోయాడనే కీలక విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని విమర్శించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో దావూద్‌ పేరు ఉందని, అల్‌ఖైదాతో సంబంధాల కారణంగా అతడిపై చర్యలు తీసుకున్నట్లు ఆ జాబితాలో పేర్కొన్నారని పూరి గుర్తుచేశారు.

ఈ వివరాలను విస్మరించడం వల్ల నివేదికను చదివేవారికి వాస్తవ పరిస్థితిపై తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందన్నారు.

ADVERTISEMENT

Details

రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా

దావూద్‌ ఆచూకీ కోసం భారత్‌ ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయించిన విషయాన్ని పూరి ప్రస్తావించారు.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస భద్రతా మండలి జాబితాలో చేర్చడానికి ముందే అతడు భారత్‌ నుంచి పారిపోయాడని స్పష్టం చేశారు.

అతడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని నివేదికలో స్పష్టంగా వివరించకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. మానవ హక్కుల వ్యవస్థ ఉగ్రవాదులకు రక్షణగా మారకూడదని, ఉగ్రవాదాన్ని ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమని పూరి పేర్కొన్నారు.

ప్రత్యేక ప్రతినిధులు నిష్పాక్షికత, పారదర్శకతతో వ్యవహరించాలని భారత్‌ కోరింది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌ జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ అంశాలను ప్రస్తావించడంపైనా భారత్‌ అభ్యంతరం తెలిపింది.

ఆ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారమని పేర్కొంది.

ADVERTISEMENT