Iranian deputy ambassador: వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి.. ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం,పలువురు గాయపడడం నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ మహ్మద్ జవాద్ హుస్సేనీతో పాటు ఆ దేశ దౌత్య ప్రతినిధులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. యూఏఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒమన్ ప్రాదేశిక జలాల్లోని దక్షిణ షిప్పింగ్ మార్గంలో ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన 'మొంబాసా', 'అల్ బహియా' అనే రెండు వాణిజ్య నౌకలను ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మృతి చెందగా,మరో ఆరుగురు భారతీయులు గాయపడ్డారు.
వివరాలు
భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన
అలాగే ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు కూడా గాయపడటంతో మొత్తం బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగకుండా వెంటనే తగ్గించే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
వివరాలు
ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధి ద్వార ఐదో వంతు భాగం
అంతర్జాతీయ సముద్ర చట్టాలకు అనుగుణంగా వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని స్పష్టం చేసింది.
ప్రపంచ చమురు రవాణాలో సుమారు ఐదో వంతు భాగం హర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది.
ఈ వ్యూహాత్మక సముద్ర మార్గంపై ప్రభావం, నియంత్రణ అంశాల్లో ఇరాన్, అమెరికా మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో ఈ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.