LOADING...
Indian Navy: హర్మూజ్‌ సంక్షోభం మధ్య భారత్‌కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'
హర్మూజ్‌ సంక్షోభం మధ్య భారత్‌కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'

Indian Navy: హర్మూజ్‌ సంక్షోభం మధ్య భారత్‌కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్‌ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్‌ తీరాలకు చేరుకుంటున్నాయి. దేశానికి అవసరమైన ఇంధన సరఫరాలను భద్రంగా కొనసాగించేందుకు భారత నౌకాదళం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'ను ప్రారంభించి, చమురు మరియు ఎల్పీజీ నౌకలను హర్మూజ్‌ జలసంధి దాటించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఆపరేషన్‌పై వివరాలను కొన్ని అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.

వివరాలు 

హర్మూజ్‌ వద్ద నేవీ అప్రమత్తం.. యుద్ధ నౌకల మోహరింపు

సాధారణ పరిస్థితుల్లో భారత్‌కు వచ్చే చమురు,గ్యాస్‌ నౌకలు సౌదీ అరేబియాలోని రాస్‌ తనురా వంటి పోర్టుల నుంచి బయలుదేరి పర్షియన్‌ గల్ఫ్‌ గుండా ప్రయాణించి హర్మూజ్‌ జలసంధి చేరుకుంటాయి. నౌక వేగం,మార్గాన్ని బట్టి ఈ ప్రయాణానికి గరిష్ఠంగా రెండు రోజులు పడుతుంది. ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో హర్మూజ్‌ వద్ద వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఇరాన్‌ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందుతూ, నౌకలు జలసంధి దాటే వరకు నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. హర్మూజ్‌ దాటిన తర్వాత నౌకలు గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లోకి, అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తాయి.

వివరాలు 

గ్యాస్‌ ట్యాంకర్లకు ఎస్కార్ట్‌.. భారత్‌ వైపు ప్రయాణం

ఈ కీలక మార్గాల్లో భద్రత కోసం భారత నేవీ ఐదు యుద్ధ నౌకలను మోహరించింది. నేవీ సహకారంతో ఇటీవల రెండు గ్యాస్‌ ట్యాంకర్లు 'పైన్‌ గ్యాస్‌', 'జగ్‌ వసంత్‌' అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి భారత్‌ వైపు కదులుతున్నాయి. ఇందుకు ముందు 'శివాలిక్‌', 'నందాదేవి' వంటి నౌకలు కూడా ఇదే ఆపరేషన్‌ ద్వారా సురక్షితంగా దేశీయ పోర్టులకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్‌కు చేరాల్సిన మరో 22 నౌకలు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సుమారు 20 నౌకలు ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్‌ ఆయిల్‌ను తరలిస్తున్నవే కావడం గమనార్హం.

Advertisement

వివరాలు 

సీమైన్స్‌ ముప్పు.. నేవీ ప్రత్యేక మార్గాల గుర్తింపు

సాధారణంగా సముద్ర ప్రయాణం హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లు మరియు నావిగేషన్ వ్యవస్థల ఆధారంగా జరుగుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో హర్మూజ్‌ సమీపంలో ఇరాన్‌ సీమైన్స్‌ను అమర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీమైన్స్‌లో చాలా భాగం బయటకు కన్పించకపోవడం వల్ల నౌకలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్‌ చార్ట్‌లను సిద్ధం చేస్తోంది. నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్‌ చేసి సురక్షిత మార్గాలను గుర్తిస్తోంది. ఆ మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని హర్మూజ్‌ జలసంధి నుంచి సురక్షితంగా దాటిస్తోంది.

Advertisement

వివరాలు 

హర్మూజ్‌ ఫీజులపై గందరగోళం.. ఇరాన్‌ వివరణ

ఇదిలాఉండగా, హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఛార్జీలు విధిస్తామని ఇరాన్‌ ప్రకటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఆ వార్తలను ఖండించింది. కానీ తాజాగా ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలకు దారి తీశాయి. హర్మూజ్‌లో నౌకల భద్రత కోసం ఫీజులు వసూలు చేసే అంశాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. మరోవైపు, అమెరికా,ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు తప్ప ఇతర దేశాల నౌకలు హర్మూజ్‌ గుండా ప్రయాణించవచ్చని ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఇరాన్‌ వెల్లడించడం గమనార్హం.

Advertisement