Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. చెత్త పడేస్తే భారీ ఫైన్.. రైల్వే కొత్త రూల్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. ఇకపై రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో పరిశుభ్రతను పాటించేలా నిబంధనలను రైల్వే శాఖ మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను దెబ్బతీయడం వంటి ఉల్లంఘనలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కు పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రయాణికుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
వివరాలు
ఏయే పనులకు జరిమానా?
రైల్వే ప్రాంగణాలు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో నిర్ణయించిన ప్రదేశాలు మినహా ఇతర చోట్ల చెత్తను పడేయడం లేదా వదిలివేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ప్రయాణికులు తమ వ్యర్థాలను నిర్దేశిత డస్ట్‌బిన్లు లేదా కంటైనర్లలోనే వేయాల్సి ఉంటుంది.
అనుమతి లేకుండా రైలు బోగీలపై పోస్టర్లు అంటించడం, రాయడం, గీయడం కూడా నిషేధం. రైల్వే ఆస్తులకు ఏ విధంగానైనా నష్టం కలిగించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
వివరాలు
ఏయే పనులకు జరిమానా?
రైల్వే ప్రాంగణాల్లో అనుమతించిన సదుపాయాలు లేకుండా వంట చేయడం, స్నానం చేయడం కూడా నిషేధిత కార్యకలాపాల్లోకి వస్తాయి. ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, మల విసర్జన చేయడంపైనా నిబంధనలు వర్తిస్తాయి. అలాగే రైల్వే ప్రాంగణాల్లో జంతువులు లేదా పక్షులకు ఆహారం పెట్టడం, వాహనాలు, పాత్రలు, దుస్తులు కడగడం, వివిధ వస్తువులను నిల్వ చేయడం వంటి చర్యలపైనా ఆంక్షలు ఉన్నాయి.
వివరాలు
జరిమానా చెల్లించకపోతే ఏం జరుగుతుంది?
నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై రైల్వే అధికారులు రూ.1,000 వరకు జరిమానా విధించవచ్చు. ఆ మొత్తాన్ని సంబంధిత వ్యక్తి చెల్లించకపోతే అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ కేసులో న్యాయస్థానం అదనంగా రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
వివరాలు
జరిమానా వసూలు చేసే అధికారం ఎవరికి ఉంది?
నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు, ఇతర వ్యక్తుల నుంచి జరిమానా వసూలు చేసే అధికారాన్ని కొంతమంది రైల్వే సిబ్బందికి కల్పించారు.
స్టేషన్ మాస్టర్లు,స్టేషన్ మేనేజర్లు ఈ జరిమానాలను వసూలు చేయవచ్చు.
అదేవిధంగా కమర్షియల్ విభాగానికి చెందిన టికెట్ కలెక్టర్లు,ఆపరేటింగ్ విభాగంలో సమాన స్థాయి హోదా కలిగిన అధికారులు కూడా జరిమానా విధించే, వసూలు చేసే అధికారం కలిగి ఉంటారు.
రైల్వే పరిపాలన ప్రత్యేకంగా అనుమతించిన ఇతర అధికారులు కూడా ఈ నిబంధనలను అమలు చేయవచ్చు.
ప్రయాణికులు రైల్వే ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ సూచించింది.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, రైల్వే ఆస్తులను దెబ్బతీయకుండా, పరిశుభ్రత ప్రమాణాలను పాటించడం ప్రతి ప్రయాణికుడి బాధ్యత అని స్పష్టం చేసింది.