భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక
ప్రతి సంవత్సరం భారత భూభాగం సుమారు 5 సెం.మీ వరకు స్థాన భ్రంశం అవుతున్నట్లు హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ ప్రభావం హిమాలయ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే రోజుల్లో భూకంపాలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో ఇటీవల భూకంపాలు తరుచూ సంభవిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా గత వారం రోజుల్లో పలుసార్లు భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే భవిష్యత్‌లో ఇలా చిన్న స్థాయిలో రాకపోవచ్చని పూర్ణచంద్రరావు చెప్పడం గమనార్హం.
హిమాలయాల వెంట పెరుగుతున్న ఒత్తిడి
ఉపరితలం వివిధ పలకలను కలిగి ఉంటుందని పూర్ణచంద్రరావు వెల్లండిచారు. ఉపరితలం నిరంతరం కదలిక వల్ల, పలకలు కూాడా కదులుతాయని చెప్పారు. దీని వల్ల హిమాలయాల వెంట ఒత్తిడి పెరుగుతుందని వెల్లడించారు. ఫలితంగా భారీ స్థాయిలో భూకంపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో తమకు 18 సీస్మోగ్రాఫ్ స్టేషన్ల బలమైన నెట్‌వర్క్ ఉందని చెప్పారు. హిమాచల్, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరం అని పిలువబడే ప్రాంతంలో ఎప్పుడైనా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.