LOADING...
Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో

Marco Rubio: పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్‌ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ మధ్యవర్తిగా వ్యవహరించడాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన తెలిపారు. అయితే, ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ భూభాగం ఆశ్రయంగా మారడంపై భారత్‌కు తీవ్ర ఆందోళనలు ఉన్నాయని స్పష్టం చేశారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన రూబియో,భారత్‌కు పాకిస్థాన్‌తో ఉన్న ప్రధాన సమస్య ఉగ్రవాదమేనని చెప్పారు. పాకిస్థాన్‌ నేలపై పనిచేస్తున్న ఉగ్రవాద గుంపులు భారత భద్రతకు ముప్పుగా మారుతున్నాయని భారత్ తరచుగా ప్రస్తావిస్తోందన్నారు. అయితే,ఇరాన్‌ అంశంలో పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం చేసినప్పుడు భారత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. ఆ అంశంపై భారత్ ఫిర్యాదు చేసే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న రూబియో

విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూబియో భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. మంగళవారం నిర్వహించనున్న క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలపై కూడా రూబియో ప్రశంసలు కురిపించారు. భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పారు. వాణిజ్య రంగంలో కూడా భారత్‌ ప్రాధాన్యం ఎంతో ఉందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే బలంగా ఉన్నాయని, తమ ప్రభుత్వ కాలం ముగిసే నాటికి మరింత పటిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement