New Ration Cards : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు మార్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో పాటు ప్రస్తుతం రేషన్ కార్డుల్లో ఉన్న మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఒక్క జిల్లాలో 50వేల దరఖాస్తులు
ఈనెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామసభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. ఒక్కో జిల్లాలో దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జిల్లాలో రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం 60వేల నుంచి 90 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.