TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభానికి సమయం తక్కువగా ఉండటంతో పాటు, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా వెంటనే అడ్మిషన్ ప్రక్రియ చేపట్టాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి, సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతుల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇలా చేయడం వల్ల డ్రాప్‌ఔట్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని కమిషన్ అభిప్రాయపడింది.
వివరాలు
11,12 తరగతుల విధానం
ప్రస్తుతం సీబీఎస్ఈతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో చాలామంది అనంతరం ప్రత్యేకంగా ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేరకుండా చదువును అక్కడితో నిలిపివేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్మీడియట్‌ను ప్రత్యేక విధానంగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించే అంశంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
వివరాలు
పరిస్థితిని సమీక్షించిన అధికారులు
అయితే ఇటీవల ఇంటర్మీడియట్ ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణాతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.