Page Loader
ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్
ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్

ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్

వ్రాసిన వారు Stalin
Sep 14, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. ఈడీ ఇచ్చిన నోటీసును రాజకీయ ప్రేరేపితమైనదిగా ఎమ్మెల్సీ కె.కవిత అభివర్ణించారు. తనకు అందజేసింది ఈడీ నోటు కాదని, మోదీ నోటీసు అని కవిత పేర్కొన్నారు. ఈడీ నోటీసును బీఆర్ఎస్ లీగల్ టీమ్‌కి అందజేస్తానని, వారి సలహా మేరకు వ్యవహరిస్తానని చెప్పారు. న్యాయపరమైన సాయం తీసుకుంటానని కవిత స్పష్టం చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం విచారణకు హాజరుకావాలని కవితకు పంపిన నోటీసులో ఈడీ పేర్కొంది.

కవిత

ఎన్నికలు రాష్ట్రాల్లో బీజేపీ ఇలా వేధిస్తుంది: కవిత

ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ఇలాగే ఈడీ, ఐటీలను పంపి వేధిస్తుందని కవిత ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలకు వెళ్తున్నందున ఇలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారన్నారు. ఏడాది కాలంగా ఈ కేసు విచారణ కొనసాగుతోందని కవిత అన్నారు. ఈ కేసు విచారణ 2జీ స్కామ్ కేసు కంటే ఎక్కువ కాలం సాగిందన్నారు. ఇది ఎప్పటికీ ముగియని టీవీ సీరియల్ లాగా ఉందన్నారు. తెలంగాణలో పొత్తుల గురించి కవితను విలేకరులు అడగ్గా, తాము ప్రజలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. తాము ఎవరికీ 'బి' టీమ్ కాదన్నారు. తాము తెలంగాణ ప్రజలు, భారత ప్రజల 'ఎ' టీమ్ అని కవిత అన్నారు.