LOADING...
ISRO: అంతరిక్షంలో 75 టన్నుల పేలోడ్‌ ప్రయోగం.. ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్‌ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్
ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్‌ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్

ISRO: అంతరిక్షంలో 75 టన్నుల పేలోడ్‌ ప్రయోగం.. ఇస్రో 40 అంతస్తుల పొడవైన జంబోరాకెట్‌ నిర్మిస్తున్నాం: ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది. ఏకంగా 40 అంతస్తుల భవనం ఎత్తుతో సమానమైన మహా రాకెట్‌ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఆ సంస్థ ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను తెలియజేశారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, ఎన్‌-1 రాకెట్‌ ప్రయోగం, అలాగే అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు వివరించారు.

వివరాలు 

55 ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తున్నాయి: నారాయణన్

''అబ్దుల్ కలాం గారు రూపొందించిన తొలి రాకెట్‌ 17 టన్నుల లిఫ్ట్‌ఆఫ్ బరువుతో, కేవలం 35 కిలోల ఉపగ్రహాన్ని లోయర్ ఆర్బిట్‌లో ఉంచింది. కానీ, నేడు మేము 75,000 కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యకు చేర్చగలిగే రాకెట్‌ నిర్మాణంపై పనిచేస్తున్నాం. దాని ఎత్తు 40 అంతస్తుల భవనం సమానం అవుతుంది'' అని నారాయణన్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశానికి 55 ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తున్నాయని, వచ్చే మూడేళ్లలో లేదా నాలుగేళ్లలో ఈ సంఖ్య మూడు నుంచి నాలుగు రెట్లు పెరగనుందని స్పష్టం చేశారు.

వివరాలు 

భారత నౌకాదళ అవసరాల కోసం జీశాట్‌-7ఆర్‌

అలాగే, ఇస్రో త్వరలో టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ శాటిలైట్‌ (టీడీఎస్‌), భారత నౌకాదళ అవసరాల కోసం రూపకల్పన చేసిన జీశాట్‌-7ఆర్‌ను ప్రయోగించనుందని తెలిపారు. ఇది ఇప్పటికే కక్ష్యలో ఉన్న జీశాట్‌-7 (రుక్మిణి) స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వి. నారాయణన్‌కు గౌరవ డాక్టరేట్‌ బహుకరించారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వయంగా ఈ గౌరవాన్ని ఆయనకు అందజేశారు.