J&K: జమ్ముకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత.. ఇద్దరు అనుమానితులు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాద సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పిస్టల్, రెండు పేలుడు పదార్థాలు (ఐఈడీలు) స్వాధీనం చేసుకున్నారు. బారాముల్లా పోలీసులు, 52వ రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా దెలీనా ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టాయి. నిఘా సమాచారంతో డార్పురా నర్సరీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోపోర్‌లోని చింకిపోరా ప్రాంతానికి చెందిన తాహిర్ అహ్మద్ మాలిక్, వసీమ్ సుల్తాన్ బేగ్‌గా గుర్తించారు. నిందితుల నుంచి టర్కీలో తయారైన కెనిక్ (CANIK) పిస్టల్, 10 తూటాలు ఉన్న మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు సుమారు 15 కిలోలు, 7.5 కిలోల బరువున్న రెండు ఐఈడీలను గుర్తించారు.
వివరాలు
ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాలో సహకరించినట్లు అనుమానం
ఒక స్కూటర్, రూ.6,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. తాహిర్ అహ్మద్ మాలిక్, వసీమ్ సుల్తాన్ బేగ్ ఉగ్రవాద సంస్థలకు సహాయకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉగ్రవాదుల కదలికలకు సహకరించడంతోపాటు వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు చేరవేయడంలో కీలక పాత్ర పోషించి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో వారి పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు.
ఈ ఘటనపై సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
వివరాలు
అనుమానిత నెట్‌వర్క్‌లోని ఇతరుల కోసం దర్యాప్తు
అరెస్టయిన నిందితులకు సంబంధించి గతంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? వారితో ఎవరు సంప్రదింపులు జరిపారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎక్కడికి తరలించాలనుకున్నారు? అనే విషయాలపైనా ఆరా తీస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.