Loading...
Bullet Train: భారత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుపై జపాన్‌ ఇంజినీర్‌ ఆందోళన
భారత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుపై జపాన్‌ ఇంజినీర్‌ ఆందోళన

Bullet Train: భారత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుపై జపాన్‌ ఇంజినీర్‌ ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్‌ జపాన్‌ రైల్వే ఇంజినీర్‌ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు. యాహూ న్యూస్‌ జపాన్‌లో ప్రచురించిన తన అభిప్రాయ వ్యాసంలో ఈ ప్రాజెక్టు మొదట రూపొందించిన షింకాన్‌సెన్‌ నమూనా నుంచి క్రమంగా దూరమైందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు భారత విధాన నిర్ణయాలతో పాటు జపాన్‌ స్పందన కూడా కారణమైందని అభిప్రాయపడ్డారు. 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు మార్గాన్ని భారత్‌-జపాన్‌ మధ్య 2015లో కుదిరిన సహకార ఒప్పందం కింద ప్రారంభించారు.

వివరాలు 

880 బిలియన్‌ యెన్‌ రుణం రూపంలో సమకూర్చిన జపాన్ 

2017 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

మొదట 2023లో పూర్తవుతుందని భావించిన ఈ ప్రాజెక్టు ఆలస్యమవడంతో ప్రస్తుతం తొలి దశ సేవలను 2027లో ప్రారంభించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముంబై నుంచి అహ్మదాబాద్‌ వరకు 12 స్టేషన్ల మీదుగా ఈ మార్గంలో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపాలని ప్రణాళిక రూపొందించారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారు 81 శాతాన్ని జపాన్‌ తక్కువ వడ్డీతో 50 ఏళ్ల కాలపరిమితి గల సుమారు 880 బిలియన్‌ యెన్‌ రుణం రూపంలో సమకూరుస్తోంది.

వివరాలు 

హైస్పీడ్‌ రైళ్ల భద్రతలో సిగ్నలింగ్‌ వ్యవస్థ అత్యంత కీలకం 

అయితే,జపాన్‌ అభివృద్ధి చేసిన డీఎస్‌-ఏటీసీ(DS-ATC) సిగ్నలింగ్‌ వ్యవస్థకు బదులుగా యూరోపియన్‌ ట్రైన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ లెవల్‌-2(ETCS-L2)ను భారత్‌ ఎంచుకోవడమే తన ప్రధాన ఆందోళన అని సుజిమురా తెలిపారు.

హైస్పీడ్‌ రైళ్ల భద్రతలో సిగ్నలింగ్‌ వ్యవస్థ అత్యంత కీలకమని,షింకాన్‌సెన్‌ రైళ్లు ఆరు దశాబ్దాలకు పైగా కార్యకలాపాల్లో ప్రయాణికుల మరణాలకు దారితీసిన ప్రమాదం ఒక్కటీ నమోదు కాకపోవడానికి సమగ్ర సిగ్నలింగ్‌ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు.

2025 జనవరిలో నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL) విడుదల చేసిన సిగ్నలింగ్‌ టెండర్‌ నిబంధనల వల్ల జపాన్‌ సాంకేతికతకు అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.

దీంతో జపాన్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థతో పాటు షింకాన్‌సెన్‌ రైళ్లకు కూడా ప్రాజెక్టులో చోటు దక్కే అవకాశాలు దాదాపు లేకపోయాయని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

రైళ్ల కొనుగోలు ప్రక్రియలోనూ భారత్‌ అంతర్జాతీయ పోటీ టెండర్లకే ప్రాధాన్యం

రైళ్ల కొనుగోలు ప్రక్రియలోనూ భారత్‌ అంతర్జాతీయ పోటీ టెండర్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో జపాన్‌తో చర్చలు ముందుకు సాగలేదని సుజిమురా విమర్శించారు.

వాస్తవానికి ఈ మార్గంలో ప్రారంభ దశలో జపాన్‌కు చెందిన ఈ5 సిరీస్‌ షింకాన్‌సెన్‌ రైళ్లను నడిపి, అనంతరం 'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు బదిలీ చేసి దేశీయ తయారీని ప్రోత్సహించాలనే ప్రణాళిక ఉందన్నారు.

అయితే వందే భారత్‌ రైళ్ల విస్తరణ తర్వాత స్వదేశీ హైస్పీడ్‌ రైళ్ల అభివృద్ధి వైపు భారత్‌ దృష్టి మళ్లిందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

జపాన్‌ గట్టిగా వ్యతిరేకించకపోవడం వ్యూహాత్మక తప్పిదం 

అంతర్జాతీయ ప్రమాణాలతో ధ్రువీకరించిన సిగ్నలింగ్‌ వ్యవస్థ, స్వతంత్ర సంస్థల ధ్రువీకరణ తప్పనిసరి అనే నిబంధనలను భారత్‌ అమలు చేయడంతో జపాన్‌ డీఎస్‌-ఏటీసీ వ్యవస్థ ప్రస్తుత రూపంలో అర్హత సాధించలేకపోయిందని సుజిమురా అభిప్రాయపడ్డారు.

నిజమైన హైస్పీడ్‌ రైళ్ల తయారీ, పరీక్షలు, ధ్రువీకరణకు అవసరమైన అనుభవం ప్రస్తుతం భారత పరిశ్రమకు ఎంతవరకు ఉందనే అంశంపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ మార్పులను జపాన్‌ గట్టిగా వ్యతిరేకించకపోవడం వ్యూహాత్మక తప్పిదమని, దీని ప్రభావం భవిష్యత్తులో భారత్‌లో చేపట్టే ఇతర బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులపైనా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ADVERTISEMENT