జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల: సత్తాచాటిన అబ్బాయిలు, 20మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ( ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో అబ్బాయిలు సత్తాచాటారు. 20మంది అబ్బాయిలు 100 పర్సంటేజ్ సాధించారు. ఈ సెషన్‌లో మహిళా అభ్యర్థులెవరూ 100 పర్సంటేజ్ సాధించలేకపోవడం గమనార్హం. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశంకోసం ఈ పరీక్షలను నిర్వహిస్తారు. జాతీయ పరీక్షల సంస్థ అధికారిక సైట్ https://jeemain.nta.nic.in/ లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. పుట్టన తేదీ, అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేసుకొని ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పరిక్షను దాదాపు 8.22లక్షమంది అభ్యర్థులు రాశారు.
10 మంది మహిళా అభ్యర్థులకు 99.9 పర్సంటేజ్
జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో మహిళా టాపర్‌గా మీసాల ప్రణతి శ్రీజ 99.997 శాతం సాధించగా, రామిరెడ్డి మేఘన 99.9944 శాతంతో రెండో స్థానం, మేధా భవానీ గిరీష్ 99.9941 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులు 99.9 పర్సంటైల్ సాధించారు. సోమవారం తుది కీని విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ, కొన్ని గంటల్లోనే ఫలితాలను వెల్లడించింది. అయితే సోమవారం సాంకేతిక కారణాల వల్ల పూర్తిస్థాయిలో వివరాలు తెలియలేదు. ఇదిలా ఉంటే, రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 6నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.