JNU: కోరిక తీరిస్తే అదనపు మార్కులు.. జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై 11 మంది విద్యార్థినుల ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఓ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయనపై 11 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై వర్సిటీకి చెందిన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే మొదటి వారంలో నిర్వహించిన వైవా పరీక్షల సందర్భంగా సదరు ప్రొఫెసర్ విద్యార్థులతో అసభ్యకరంగా మాట్లాడేవారని ఆరోపణలు వచ్చాయి. తన లైంగిక కోరికలను అంగీకరిస్తే పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తానంటూ విద్యార్థినులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
వాట్సాప్ గ్రూప్ పోస్టుతో వెలుగులోకి..
ప్రొఫెసర్ ప్రవర్తనతోపాటు ఆయన వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని ఓ విద్యార్థిని మే నెలలో ఓ అనధికారిక వాట్సాప్ గ్రూప్‌లో పంచుకున్నట్లు సమాచారం.
ఆ పోస్టు అనంతరం మరికొందరు విద్యార్థినులు కూడా స్పందించారు. తమకూ సదరు ప్రొఫెసర్ నుంచి ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయని వారు వెల్లడించినట్లు తెలుస్తోంది.
దీంతో బాధిత విద్యార్థినులు మే నెలాఖరులోగా జేఎన్‌యూ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదులు అందజేశారు.
వాటిపై స్పందించిన కమిటీ పలువురు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఆరోపణలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
45 రోజుల సెలవుల తర్వాత మళ్లీ విచారణ
సుమారు 45 రోజులపాటు కొనసాగిన సెమిస్టర్ సెలవుల కారణంగా విచారణకు విరామం వచ్చింది.
సెలవులు ముగిసి వర్సిటీలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో ఐసీసీ మళ్లీ దర్యాప్తును కొనసాగిస్తోంది.
దీంతో ఇంతకుముందు వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణల వ్యవహారం మరోసారి జేఎన్‌యూలో చర్చనీయాంశంగా మారింది.