'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో బంధాన్ని తెంచుకున్న తర్వాత.. నడ్డా బిహార్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నితీశ్‌పై నడ్డా విమర్శాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడ లేదని నడ్డా విమర్శించారు. నితీశ్‌ను ఉద్దేశించి.. ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా నడ్డా ప్రస్తావించారు. నితీశ్‌ను సుధాకర్ సింగ్ 'శిఖండి'గా అభివర్ణించారని, అయితే ఆ పదాన్ని తాను ఇప్పుడు ఉచ్ఛరించదల్చుకోలేదన్నారు. కానీ, బిహార్ ప్రజలను నితీశ్ అగౌరపర్చారని దుయ్యబట్టారు. ఒకరకంగా రాష్ట్ర ప్రజలను ఆయన మోసం చేశారని మండిపడ్డారు.
'బీజేపీ పాలనకు సమయం ఆసన్నమైంది'
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. బిహార్‌కు బీజేపీ నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైనట్లు నడ్డా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1917లో మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన ఆశ్రమం నుంచి నితీశ్ తన యాత్రను ప్రారంభించనున్నారు. యాత్ర సందర్భంగా తాను అన్ని ప్రాంతాలను సందర్శిస్తానని, ప్రజలను కలుస్తానని, అనంతరం అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటామని నితీష్ కుమార్ చెప్పారు.