AP: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి జేఎస్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన క్రీడాకారులకు శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలపై అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షలు తెలిపారు. 2025లో జరగనున్న ఏషియన్, కామన్‌వెల్త్, పారా కామన్‌వెల్త్ క్రీడలకు ఎంపికైన 18 మంది అథ్లెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం రూ.2.23 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
వివరాలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోచ్‌లను తీసుకురావడానికి చర్యలు..
క్రీడాకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు మరింత ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు క్రీడాకారులు గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన కోచ్‌లను తొలగించడం వల్ల క్రీడాభివృద్ధికి ప్రతికూల ప్రభావం పడిందని అభిప్రాయపడ్డారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గుంటూరులో విదేశీ కోచ్‌లతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి విధానాలు నిరంతరాయంగా కొనసాగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోచ్‌లను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
వివనాలు
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి జేఎస్‌డబ్ల్యూ సంస్థ సహకారం..
అలాగే, ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి జేఎస్‌డబ్ల్యూ సంస్థ సహకారం అందించేందుకు అంగీకరించిందని వెల్లడించారు. స్పోర్ట్స్ ట్రైనింగ్‌తో పాటు క్రీడా విద్య అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, అథ్లెట్లు జ్యోతిక శ్రీ, వెంకటరామిరెడ్డి, ఆర్. స్వాతి, భవానీ యాదవ్, కుసుమ రావాడ, రష్మి, మల్లల అనూష, శిరీష, కుంజా రజిత, ఆర్చరీ క్రీడాకారులు గణేష్ మణిరత్నం, యుక్తశ్రీ, స్విమ్మింగ్ విభాగానికి చెందిన తీర్థుసామదేవ్, పారా స్విమ్మింగ్ క్రీడాకారుడు భవానీ కార్తీక్ పాల్గొన్నారు.