LOADING...
Justice Yashwant Varma: నోట్ల కట్టల వివాదం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా
నోట్ల కట్టల వివాదం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

Justice Yashwant Varma: నోట్ల కట్టల వివాదం.. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దిల్లీలో తన అధికారిక నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన ఘటన నేపథ్యంలో ఆయనపై అభిశంసన ప్రక్రియకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేశారు.

వివరాలు 

రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుంది: లోక్‌సభ సెక్రటేరియట్

విచారణలో నోట్ల కట్టలు దొరికిన విషయం నిజమేనని కమిటీ తేల్చింది. దీంతో రాజీనామా చేయాలని సీజేఐ వర్మకు సూచించారు. అయితే ఆయన తిరస్కరించడంతో అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. జస్టిస్‌ వర్మను పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాలు కూడా సమర్పించారు. అయితే తాజాగా ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ ముగిసినట్లేనని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

Advertisement