#NewsBytesExplainer: జగన్ కంచుకోట కడపలో వైసీపీ నేతల మౌనం.. కారణాలేమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
వై.ఎస్.జగన్ స్వస్థలం కడప జిల్లానే. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం వైసీపీదే హవా. కానీ గత ఎన్నికల తర్వాత అక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా తారుమారైంది. కడపలో తొలిసారి టీడీపీ బలం చూపించింది. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూడా వైసీపీ తన పట్టును నిలబెట్టుకోలేకపోయింది. పరాజయం తర్వాత జిల్లాలో పలువురు వైసీపీ నేతలు మౌనం వహిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అతి కొద్దిమంది తప్ప మిగతా నాయకులు నిశ్శబ్దంగా ఉండిపోవడం వెనుక కారణాలేంటి? మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై దృష్టి పెట్టకపోతే స్థానిక క్యాడర్ పరిస్థితి ఎటు వెళ్తుంది?
వివరాలు
కడప మొత్తం జగన్ కుటుంబం
జగన్‌కు కడప జిల్లా రాజకీయంగా అత్యంత కీలకం. అయన తాతలు,తండ్రుల కాలం నుంచి ఆధిపత్యం చలాయించిన ప్రాంతం అధికారంలో ఉన్నా, లేకున్నా కడప మొత్తం జగన్ కుటుంబం, వారి అనుచరుల ఆధీనంలోనే ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పరిస్థితి మారిపోయింది.అప్పటి నుంచి జిల్లాలో చాలా మంది వైసీపీ నేతలు కనబడకపోవడం గమనార్హం. అపోజిషన్ లో ఉన్నందుకా, లేక దృష్టిలో పడకూడదన్న ఉద్దేశ్యమా తెలియదు కానీ వైసీపీ నేతలు వెలుగులోకి రావడాన్ని తప్పించుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ,రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లను వైసీపీ దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహా అన్నింటా వైసిపి గెలిచింది.
వివరాలు
నడిపించే నేతలు ఎక్కడ?
ఇక 2019 లో జిల్లా అంతా ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్. 2024లో ఉమ్మడి కడప జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలిచింది వైసీపీ. జగన్‌ను ఎక్కువగా కలిచివేసింది ఓటమి కాదు, ఆయన కష్టకాలంలో నేతలు తనవెంట నిలబడకపోవడమేనని క్యాడర్ లో మాట. ఇప్పుడు నియోజకవర్గాల్లో కార్యకర్తలు "నాయకత్వం ఎక్కడ?" అన్న ఆవేదనతో ఎదురుచూస్తున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా వైసీపీ ఇంకా గాడిలో పడలేదన్న కామెంట్లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
వివరాలు
నడిపించే నేతలు ఎక్కడ?
ఇటీవలే జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న జగన్ మేనమామ రవీంద్రరెడ్డి, అలాగే వెంపల్లి సతీష్ రెడ్డి ఎక్కువగా మీడియాకే పరిమితమవుతున్నారట. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్ ఎవరో ఇంకా నిర్ణయించకపోవడంతో అక్కడ కార్యకలాపాలు చల్లబడిపోయాయట. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే జగన్ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ వ్యక్తిగత పనుల్లోనే బిజీగా ఉన్నారని ప్రచారం.
వివరాలు
ఎక్కువగా జిల్లాలో కనిపించని జగన్ సన్నిహితులు
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వయస్సు కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి కబ్జా ఆరోపణలతో సైలెంట్‌గా ఉన్నారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా పని చేయాలన్న తపన ఉన్నా స్థానిక రాజకీయాలు ఆమెకు ఇబ్బందిగా మారాయట. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ జగన్‌కు సన్నిహితులే అయినా ఎక్కువగా జిల్లాలో కనిపించడం లేదట. పులివెందుల వ్యవహారాలు పూర్తిగా ఎంపీ అవినాశ్, జగన్ పర్యవేక్షణలోనే నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు.
వివరాలు
స్థానిక ఎలక్షన్ల టెన్షన్
ప్రతి నేత తనదైన విధంగా ప్రవర్తించడంతో జిల్లా క్యాడర్ అయోమయానికి లోనవుతోంది. ఈ సందర్భంలో స్థానిక ఎన్నికలు దగ్గరపడడం జగన్ కు మరింత భారంగా మారిందట. ఇదే క్రమం కొనసాగితే ఆ ఎన్నికల్లో కూడా వైసీపీ ఫలితాలు ఆశజనకంగా ఉండకపోవచ్చని కార్యకర్తలు భయపడుతున్నారు. కడపలో పార్టీని బలపర్చాలన్న ఆశతో స్థానిక నేతలు జగన్‌ను కూడా సంప్రదిస్తున్నారట. యాక్టివిటీపై స్పష్టత వచ్చేంతవరకు "కొంచెం టైమ్ ఇవ్వండి" అంటూ జగన్ క్యాడర్‌ను ఓదారుస్తున్నాడని టాక్. స్థానిక పోరాటం మొదలు కావడానికి ముందే ఫ్యాన్ పార్టీ తన బలాన్ని పునరుద్ధరించుకుంటుందా లేదా అన్నది చూడాల్సిందే.