Loading...
Kaleshwaram Barrage: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రూ.4 వేల కోట్లు.. అన్ని బ్లాకుల్లో స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ
అన్ని బ్లాకుల్లో స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ

Kaleshwaram Barrage: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు రూ.4 వేల కోట్లు.. అన్ని బ్లాకుల్లో స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు భారీగా ఖర్చు చేయాల్సి రానుంది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సుమారు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేసింది. డిజైనర్ సంస్థ అప్రీ, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీర్లు గత కొన్ని రోజులుగా దీనిపై విస్తృతంగా చర్చించి గురువారం తుది అంచనాకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొదట కాళేశ్వరం బ్యారేజీల్లో సమస్యలు ఉన్న కొన్ని బ్లాకుల్లో మాత్రమే స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. బ్యారేజీ నుంచి కిందకు దూకే నీటి వేగాన్ని నియంత్రించి, దాని ప్రభావాన్ని తగ్గించే ప్రాంతాన్ని స్టిల్లింగ్ బేసిన్ అంటారు.

వివరాలు 

మేడిగడ్డ ఏడో బ్లాక్ నిర్ణయంతో పెరగనున్న వ్యయం

అయితే బ్యారేజీల భద్రత, దీర్ఘకాలిక మన్నికను దృష్టిలో ఉంచుకుని అన్ని బ్లాకుల్లోనూ స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించాల్సిందేనని టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ (టీఓసీ)స్పష్టం చేసింది.

దీంతో కొత్త ప్రతిపాదనలకు అనుగుణంగా అంచనాలను సవరించారు.

ప్రాజెక్టు ఇంజినీర్లు మొదట రూపొందించిన అంచనాలు ఇంకా ఎక్కువగా ఉండగా.. డిజైనర్ సంస్థ అప్రీ,నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత వ్యయం సుమారు రూ.4వేల కోట్లకు చేరినట్లు సమాచారం.

మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి తిరిగి నిర్మించాలా?లేక గేట్లు లేకుండా నాన్ ఓవర్‌ఫ్లో నిర్మాణంగా మార్చాలా? అనే అంశంపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే పునరుద్ధరణ పనులను మాత్రం అసలు బ్యారేజీలను నిర్మించిన సంస్థతోనే చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.

వివరాలు 

స్టిల్లింగ్ బేసిన్ విస్తరణతోనే సమస్యకు పరిష్కారం

మేడిగడ్డ బ్యారేజీలో ప్రస్తుతం 46.8 మీటర్లుగా ఉన్న స్టిల్లింగ్ బేసిన్‌ను 66 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు.

మొత్తం ఎనిమిది బ్లాకుల్లో మొదట నాలుగు బ్లాకులకు మాత్రమే ఈ విస్తరణ చేపడితే సరిపోతుందని భావించారు.

అన్నారం బ్యారేజీలో ప్రస్తుతం 45 మీటర్లుగా ఉన్న స్టిల్లింగ్ బేసిన్‌ను 66 మీటర్లకు పెంచాలని, మొత్తం ఆరు బ్లాకుల్లో మూడింటికి విస్తరించాలని తొలుత నిర్ణయించారు.

సుందిళ్ల బ్యారేజీలో 30 మీటర్లుగా ఉన్న స్టిల్లింగ్ బేసిన్‌ను 58 మీటర్లకు పెంచి, మొత్తం ఏడు బ్లాకుల్లో నాలుగింటికి ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.

అయితే కొన్ని బ్లాకులకే స్టిల్లింగ్ బేసిన్ విస్తరణను పరిమితం చేస్తే సమస్య పూర్తిగా పరిష్కారం కాదని డిజైనర్ సంస్థ అభిప్రాయపడినట్లు తెలిసింది.

ADVERTISEMENT

వివరాలు 

అన్ని బ్లాకుల్లో స్టిల్లింగ్ బేసిన్ విస్తరణకు టీఓసీ సూచన

అన్ని బ్లాకుల్లోనూ ఈ విస్తరణ చేపడితేనే బ్యారేజీల సమస్యలను అధిగమించడంతో పాటు దీర్ఘకాలిక మన్నికను కాపాడుకోవచ్చని సూచించినట్లు సమాచారం.

ఈ అంశాలపై చర్చించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)సాంకేతిక సభ్యుడు సమీర్‌కుమార్ శుక్లా అధ్యక్షతన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ ఈ నెల 14న దిల్లీలో సమావేశమైంది.

బ్యారేజీలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు,డిజైనర్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలు సహా పలు సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈచర్చలకు సంబంధించిన మినిట్స్‌ను కమిటీ సభ్యులందరికీ పంపించారు.

కొన్ని బ్లాకుల్లో మాత్రమే స్టిల్లింగ్ బేసిన్‌ను విస్తరించాలన్న ప్రతిపాదన విజయవంతం కావడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది.

బ్యారేజీల దీర్ఘకాలిక భద్రత, మన్నికను దృష్టిలో ఉంచుకుని అన్ని బ్లాకుల్లోనూ స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ చేపట్టాలని సమావేశ మినిట్స్‌లో స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

బ్యారేజీల నిర్మాణంలో కీలక మార్పులకు ప్రతిపాదనలు

దీనికి అనుగుణంగా పియర్స్‌ను కూడా విస్తరించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న సీకెంట్ పైల్ కట్‌ఆఫ్ స్థానంలో ఆర్‌సీసీ డయాఫ్రం కట్‌ఆఫ్ వాల్ నిర్మించాలని నిర్ణయించారు.

టెయిల్ వాటర్‌పై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ఫ్లడ్ బ్యాంకుల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చని సమాచారం.

మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో రాఫ్ట్‌కు ఎగువన ఉన్న కొన్ని బేలలో మార్పులు చేయాల్సిన అంశంపైనా టీఓసీ చర్చించింది.

అక్కడ ఏర్పడిన గుంతను పూడ్చడం, నీరు లోపలికి ఇంకే సీపేజ్ సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

వివరాలు 

మేడిగడ్డ వరద డిజైన్‌పై కేంద్ర జలసంఘం నిర్ణయమే కీలకం

మేడిగడ్డ బ్యారేజీని గతంలో 85 వేల క్యూమెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ చేశారు.

అయితే ఇప్పుడు 75 వేల క్యూమెక్కుల వరద ప్రవాహానికి అనుగుణంగా డిజైన్ చేస్తే సరిపోతుందని డిజైనర్ సంస్థ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను నాన్ ఓవర్‌ఫ్లో నిర్మాణంగా మార్చే అవకాశం ఉంటుందని సూచించింది.

అయితే ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సూచించింది.

వివరాలు 

మేడిగడ్డ వరద డిజైన్‌పై కేంద్ర జలసంఘం నిర్ణయమే కీలకం

వరద డిజైన్ సామర్థ్యాన్ని తగ్గించే అంశంపై కేంద్ర జలసంఘంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

వరద ప్రవాహం అంచనాను తగ్గించడం సరైన నిర్ణయం కాదని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర జలసంఘమేనని ప్రస్తుతం కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమీర్‌కుమార్ శుక్లా స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దీంతో మేడిగడ్డ ఏడో బ్లాక్ భవిష్యత్తుపై కేంద్ర జలసంఘం నిర్ణయం కీలకంగా మారింది.

ADVERTISEMENT