Loading...
Kangana Ranaut: 'ఆ వయసులో నేను రెండు జాతీయ అవార్డులు గెలిచా'.. సౌరవ్‌ దాస్‌కు కంగనా కౌంటర్
'ఆ వయసులో నేను రెండు జాతీయ అవార్డులు గెలిచా'.. సౌరవ్‌ దాస్‌కు కంగనా కౌంటర్

Kangana Ranaut: 'ఆ వయసులో నేను రెండు జాతీయ అవార్డులు గెలిచా'.. సౌరవ్‌ దాస్‌కు కంగనా కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారానికి సంబంధించి జెన్‌-జీ నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఈసారి కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ చేసిన వ్యాఖ్యలకు ఆమె తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై విమర్శలు చేసిన సౌరవ్‌ దాస్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జెన్‌-జీ నిరసనకారులను "గట్టర్‌ జనరేషన్‌"గా అభివర్ణిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సౌరవ్‌ దాస్‌ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ నాయకులే పెద్దగా పట్టించుకోరని, అలాంటప్పుడు తామెందుకు వాటిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రశ్నించారు. జెన్‌-జీ, జెన్‌-ఆల్ఫా వంటి యువత కూడా కంగనా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వదని అన్నారు.

వివరాలు 

కంగనా కంటే దేశ యువత సమాజానికి ఎక్కువ సేవ చేసింది: సౌరవ్‌ దాస్

అంతేకాదు, కంగనా కంటే దేశ యువత సమాజానికి ఎక్కువ సేవ చేసిందని సౌరవ్‌ దాస్‌ వ్యాఖ్యానించారు.

హిమాచల్‌ప్రదేశ్‌ ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్లిన సందర్భంగా చిన్న పనినే తాను చేయలేనని కంగనా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమె ఎంత సీరియస్‌గా ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నారో అందరికీ అర్థమవుతోందని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలకు కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా బదులిచ్చారు.

సౌరవ్‌ దాస్‌ గురించి నెట్టింట వెతికితే 28 ఏళ్ల విద్యార్థి అని కనిపించిందని, అయితే అది తనకు నమ్మశక్యంగా అనిపించలేదని అన్నారు.

వివరాలు 

అందుకే బిజీగా ఉంటా: కంగనా

రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే అయినప్పటికీ, గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నానని కంగనా పేర్కొన్నారు.

సౌరవ్‌ దాస్‌ వయసులోనే తాను రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని గుర్తుచేశారు.

తాను పార్లమెంట్‌ సభ్యురాలిగా పనిభారం ఎక్కువగా ఉందని చెప్పిన మాటలను కూడా కంగనా సమర్థించుకున్నారు.

ఎంపీగా మాత్రమే కాకుండా దర్శకురాలు, నటి, నిర్మాత, స్క్రీన్‌ రైటర్‌, వ్యాపారవేత్తగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నందునే బిజీగా ఉంటానని తెలిపారు.

అయితే, ఎలాంటి పని లేకుండా ఉండే వ్యక్తులకు బిజీ జీవితమంటే ఏమిటో అర్థం కాదంటూ సౌరవ్‌ దాస్‌పై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు.

"సౌరవ్‌.. నీది వ్యక్తిగత సమస్య. నువ్వు విద్యార్థివి కాదు. కనీసం ఇప్పటికైనా కొన్ని నైపుణ్యాలు నేర్చుకో" అంటూ కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT