ప్రభుత్వాస్పత్రి నుంచి నవజాత శిశువును ఈడ్చుకెళ్లిక కుక్క; చిన్నారి మృతి
ప్రసూతి వార్డు నుంచి ఒక కుక్క నవజాత శిశువును ఈడ్చుకెళ్లిన ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. నవజాత శిశువును నోటిలో పెట్టుకుని ప్రసూతి వార్డు చుట్టూ కుక్క పరిగెత్తడాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది దాన్ని తరిమికొట్టారు. అనంతరం ఆ చిన్నారిని పిల్లల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుక్క కాటుకు ముందే చిన్నారి చనిపోయిందా? లేదా కుక్క వల్లే చనిపోయిందా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
చిన్నారి తల్లిదండ్రులపై అనుమానం?
పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోస్టుమార్టం తర్వాతే శిశువు మృతికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందని ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెప్పారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటన శనివారం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణుల రికార్డులను చెక్ చేసేందుకు అధికారులు సమీపంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు.