రిజర్వేషన్ల కోసం ఆందోళన; యడ్యూరప్ప ఇల్లు, కార్యాలయంపై రాళ్ల దాడి
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) అంతర్గత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోమవారం శివమొగ్గ జిల్లాలో బంజారా, భోవి సంఘాల కార్యకర్తలు సోమవారం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇల్లు, కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అనంతరం రాళ్లు రువ్వారు. షికారిపుర పట్టణంలో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో షికారిపుర పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. లంబానీ అనే బంజారా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కూడా గాయపడినట్లు ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
అపోహల కారణంగానే ఇల్లు, కార్యాలయంపై దాడి: యడియూరప్ప
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వల్ల బంజారా సామాజికవర్గం గణనీయమైన లబ్ధి పొందుతోంది. అయితే తాజాగా సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో చేసిన మార్పులతో బంజారా సామాజికవర్గం రిజర్వేషన్ల వాటా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన అంతర్గత రిజర్వేషన్లు ఎస్సీ కమ్యూనిటీలోని వివిధ ఉపకులాలకు నిర్దిష్ట కోటాలను కేటాయించాయి. బంజారా సామాజికవర్గానికి తక్కువ రిజర్వేషన్లు కల్పించారని నిరసనకారులు ఆరోపించారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడిపై యడియూరప్ప స్పందించారు. షికారిపురలో ఏది జరిగినా అది అపోహ కారణంగానే జరిగిందని, ఎవరినీ నిందించబోనన్నారు. బంజారా నేతలతో చర్చిస్తానని, బంజారా సామాజికవర్గం తాను సీఎం కావడానికి సహకరించిందని పేర్కొన్నారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించారు.