బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించినట్లు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. కర్ణాటకలోని దావణగెరెలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో 'పాలిటిక్స్ ఆఫ్ పర్సెప్షన్'ను 'పాలిటిక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్'గా బీజేపీ మార్చిందని చెప్పారు. కొన్నేళ్లుగా దేశం 'డర్టీ పాలిటిక్స్'లో కూరుకుపోయిందని మోదీ అన్నారు. అప్పుడు దేశంలో ఆరోపణలు, నిందల రాజకీయం నడిచిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ దృక్కోణాన్ని మార్చిందన్నారు. పనితీరు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచిందన్నారు. చాలా కాలం పాటు అవకాశవాద, స్వార్థపూరిత ప్రభుత్వాలను చూసిన కర్ణాటక చాలా నష్టపోయిందన్నారు మోదీ. రాష్ట్ర పురోగతిపై అది ప్రభావితం చేసిందన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా బీజేపీ సుస్థిర ప్రభుత్వం అవసరం అన్నారు మోదీ.
కాంగ్రెస్ కర్ణాటకను కాంగ్రెస్ కొంతమంది నాయకుల జేబులు నింపే సాధనంగా చూస్తోంది: మోదీ
కర్ణాటకలో అభివృద్ధిని బీజేపీ వేగవంతం చేసిందన్నారు. కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునరుద్ఘాటించారు. కర్ణాటకను కాంగ్రెస్ కేవలం కొంతమంది నాయకుల జేబులు నింపే సాధనంగా చూస్తోందని మండిపడ్డారు. 'మోదీ తేరీ కబర్ ఖుడేగీ' అని కాంగ్రెస్ అంటోందని, అయితే కర్ణాటక ప్రజలు మాత్రం 'మోదీ తేరా కమల్ ఖిలేగా' అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనుంది. త్వరలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.